11-08-2025 10:02:36 PM
గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజుకి విజ్ఞప్తి
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి
మంగపేట (విజయక్రాంతి): దేశంలో సుమారు ఏడు లక్షల ఎకరాల్లో ప్రధాన వాణిజ్య సుగంధ పంటగా సాగవుతున్న మిర్చి పంట రైతులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా సరైన మద్దతు ధర లేక ఆర్థికంగా చితికి పోతున్నారని ఈ నేపథ్యంలో "జాతీయ మిర్చి బోర్డు" ఏర్పాటు చేసి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నించాలని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు(Goa Governor Pusapati Ashok Gajapathi Raju)ని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం గోవా గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ లో అశోక్ గజపతి రాజుని నాసిరెడ్డి సాంబశివరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి వ్యవసాయ రంగానికి చిహ్నమైన నాగలిని బహుకరించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి గవర్నర్ అశోక్ గజపతికి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగువారిగా ఉన్నతమైన గవర్నర్ పదవి బాధ్యతలు చేపట్టటం తమకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు. అనంతరం సాంబశివరెడ్డి గవర్నర్ అశోక్ గజపతి రాజుతో భేటీ అయి సుగంధ పంటలకు సంబంధించిన పలు సమస్యలను అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయడం భారత ప్రభుత్వ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ పరిధిలో ఉన్న కమాడిటీ బోర్డ్స్ కి బడ్జెట్ కేటాయింపులు విరివిగా పెంచడం మిర్చి కి క్వింటల్ కి రూ ఇరువై వేలు కనీస మద్దతు ధర నిర్ణయించి గ్రామస్థాయిలో ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తమ వంతు సహకారం అందించాలని గవర్నర్ అశోక్ గజపతిని సాంబశివరెడ్డి అభ్యర్థించారు అనంతరం మిర్చి రైతుల సమస్యలపై గోవా గవర్నర్ కి సాంబశివరెడ్డి లేఖ అందజేశారు సమస్యలు విన్న గవర్నర్ అశోక్ గజపతి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నాగలి చూసి మురిసిన గవర్నర్...
సాంబశివరెడ్డి బహుకరించిన వ్యవసాయ రంగానికి చిహ్నమైన నాగలి ని చూసి గవర్నర్ అశోక్ గజపతి రాజు మురిసిపోయారు నాగలి బహుకరించిన సాంబశివరెడ్డి ని అభినందించారు అనంతరం భవిష్యత్తులో నాగలిని మ్యూజియంలో చూడాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ గాది లింగప్ప వికాస్ అగ్రి ఫౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చి పులుసు నరేష్ తదితరులు పాల్గొన్నారు.