28-07-2025 01:43:01 AM
నాగర్‌కర్నూల్, జూలై 27(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించే ఆహారంపై సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే విద్యార్థులు తిన్న ఆహారం విషతుల్యానికి కారణమైందని అధికార యంత్రాంగం అనుమానిస్తోంది. ఫంగస్ ఉన్న ఉల్లిపాయ, క్యాబేజీతో తయారుచేసిన పకోడితోపాటు కాలం చెల్లిన పాలతో తయారుచేసిన పెరుగు తినడం వల్లే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు.
శనివారం రాత్రి ఉయ్యాలవాడ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థులు సాయంత్రం స్నాక్స్ పకోడి, రాత్రి భోజనం అనంతరం కొద్దిసేపటికి కడుపునొప్పి వాంతులు, విరేచనాలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న ఆమె వెంటనే నాగర్‌కర్నూల్ వచ్చిన తర్వాత నలుగురు విద్యార్థులను కారులో జనరల్ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం సుమారు 30 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 108 సాయంతో జనరల్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ తబితారాణి, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. గురుకుల పాఠశాలలోనే వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు.
అక్కడే కొంతమంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో 480, కళాశాలలో 360 మంది విద్యార్థులు చదువుతున్నారు. రాత్రి పకోడితోపాటు పెరుగుతో భోజనం చేసిన 111 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇందులో 79 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందారు.
అందాల భామలే ముఖ్యమా: మాజీమంత్రి హరీశ్‌రావు
అందాల పోటీలు నిర్వహించిన క్రమంలో సుమారు 5సార్లు సీఎం రేవంత్‌రెడ్డి వారిని చూసేందుకు సమయం కేటాయించారు. కానీ ఫుడ్ పాయిజన్ జరిగి గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆసుపత్రిపాలైతే కనీసం వారిని చూసేందుకు సమయం లేదా అంటూ మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
గురుకుల పాఠశాలలోని విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గురుకులాల్లో విద్యార్థుల మరణాలు పెరిగాయని, మానవ హక్కుల కమిషన్, హైకోర్టు కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి న్యాయం చేయాలన్నారు.
హరీశ్‌రావువి చిల్లర రాజకీయాలు: మంత్రి జూపల్లి కృష్ణారావు
రాజకీయ లబ్ధి కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా శవాలపై పేలాలు ఏరుకునే విధంగా చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పరిపాలనలోనే అత్యధికంగా ఫుడ్ పాయిజన్ కేసులు, విద్యార్థుల మరణాలు సంభవించాయన్నారు. ఏ ఒక్క రోజూ కేసీఆర్ గురుకులాలను సందర్శించిన దాఖలాలు లేవన్నారు.
సమగ్ర విచారణ జరపాలి: రాంచందర్‌రావు
జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.