22-07-2025 07:20:15 PM
నిర్మల్ (విజయక్రాంతి): మంగళవారం నిర్మల్ గ్రామీణ మండలం రత్నపూర్ కాండ్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్(District Lead Bank Manager Ram Gopal) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్డిఎం మాట్లాడుతూ, విద్యార్థులంతా పాఠశాల స్థాయి నుంచే ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను అర్థం చేసుకోవడం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, పొదుపు, తదితర బ్యాంకింగ్ కార్యకలాపాలు అన్ని ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించినవేనని అన్నారు.
బ్యాంకింగ్ కార్యకలాపాకు వినియోగించే వివిధ రకాల ఫారములను గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల కుటుంబాల నిత్యజీవితంలో అవసరమగు పంట, విద్య, గృహ, వాహన, తదితర రుణాల వివరాలను అర్థమయ్యేలా విద్యార్థులకు చెప్పారు. విద్యార్థులకు పొదుపుపై అవగాహన కల్పిస్తూ భవిష్యత్తు కోసం ఆర్థికంగా ఇప్పటి నుంచే స్థిరమైన ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలన్నారు. చిన్నచిన్న పొదుపులను అలవాటు చేసుకోవాలని సూచించారు. నేటి సాంకేతిక యుగంలో ఎన్నో ఆర్థిక నేరాలు జరుగుతున్నాయని వాటిపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంకు రుణాలు పొందుటలో కీలకపాత్ర వహించే సిబిల్ స్కోర్ విధానాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.