22-07-2025 07:16:13 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): రైతుల వ్యవసాయ అవసరాలకు సరిపడా యూరియా డిఏపి సరఫరా చేయాలని, యూరియా కొరత రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ మంగళవారం ఇల్లందు వ్యవసాయ అధికారికి అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం-ఎల్) మాస్ లైన్ ప్రజాపంధా రాష్ట్ర నాయకులు నాయిని రాజు, జిల్లా నాయకులు ఆర్ బోస్ లు మాట్లాడుతూ, ఇల్లందు మండలం 90 శాతం వ్యవసాయ ఆధారిత మండలమని ఈ మండలంలో వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, కంది, కూరగాయలు లాంటి అనేక రకాల పంటలు పండిస్తున్నారని ఈ పంటలకు సరిపడా యూరియా డిఏపి దొరకక రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా డిఏపిను సరఫరా చేయాలని, మండలంలోని ముకుందాపురం, ప్రాంతాలలో యూరియా అమ్మకపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో కొమరారం మాజీ ఎంపిటిసి అజ్మీర బిచ్చా, అఖిల భారత ఐక్య రైతు సంఘం డివిజన్ నాయకులు భూక్య పాష, కుంజ సమన్న, అజ్మీర సక్రాం, మాలోత్ సోమల, అజ్మీర వీరు, యద్దల్లపల్లి సావిత్రి, కోరం ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.