calender_icon.png 11 September, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యక్ష పోరు

11-09-2025 12:59:54 AM

-భువనగిరి వేదికగా లక్షల మందితో సభ

-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

మహబూబాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీలు రాజకీయ పోరుకు సిద్ధం కావాలని, దసరా లోపు తేల్చకపోతే, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు భువనగిరి వేదికగా లక్షల మందితో పోరుకు సిద్ధం కానున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ అండ్ బి వసతి గృహంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయని, అదే జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్రం నుండి బీజేపీ నాయకులు కేంద్రానికి తమ విధానాన్ని తెలిపే విధంగా వినతిపత్రం కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆరోపించారు. అగ్రవర్ణాల ప్రజలు 9 శాతం ఉన్నప్పటికీ, 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, జనాభా ప్రాతిపాదికన దామాషా ప్రకారం బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీలు రాజకీయ పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

భువనగిరి వేదికగా బీసీల సత్తా చాటేందుకు సంఘటితంగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ కేయూ ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగాని సోమయ్య, జిల్లా అధ్యక్షుడు గుండగాని వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు ప్రభాకర్, జిల్లా యూత్ అధ్యక్షుడు బసనబోయిన మురళి యాదవ్, నాయకులు తాళ్లపల్లి బిక్షం గౌడ్, నిమ్మల వెంకన్న గౌడ్, బొమ్మన బోయిన వెంకన్న యాదవ్, లింగమూర్తి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.