calender_icon.png 6 October, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు పోతున్నా..

06-10-2025 12:00:00 AM

- ప్రమాదపుటంచునే జీవనోపాధి 

- రాజీవ్ రహదారి పక్కనే వ్యాపారాలు

- రోడ్డుపైనే వాహనాలు ఆపి కొనుగోలు చేస్తున్న  వాహనదారులు 

- ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదా

- పట్టించుకోని ఆర్ అండ్ బి, ఫారెస్ట్ అధికారులు

- ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఫలితం శూన్యం

గజ్వేల్, అక్టోబర్ 5: పొట్టకూటి కోసం ప్రమాదపుటంచునే వారు జీవనోపాధిని పొందుతున్నారు. పండ్లు, మొక్కజొన్న కంకులు, కూరగాయలు రాజీవ్ రహదారి ఇరువైపుల అమ్ముకుంటూ ఆ రైతులు వ్యాపారులు జీవనోపాధి పొందుతున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు వ్యాపారాలు చేసి పొట్ట పోసుకుందామన్న తపనతో రోడ్డు పక్కన ఉంటే ప్రాణం పోతుంది అన్న విషయం కూడా మర్చిపోతున్నారు.

రెక్క ఆడితే గాని డొక్కాడని ఈ చిరు వ్యాపారులు అదే జీవనానికి అలవాటైపోయారు. ఈ రాజీవ్ రహదారి పైనుండే మంత్రులు ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు వెళ్తున్నా వీరి గురించి పట్టించుకునే వారే లేరు. గత ప్రభుత్వంలో పాతూరు వద్ద వ్యాపారులకు మార్కెట్ ను ప్రభుత్వం నిర్మించింది. కానీ వర్గల్ మండలం గౌరారం, కుకునూరు పల్లి బ్రిడ్జి సమీపంలో, బెజ్జంకి మండలం దేవక్కపల్లి ప్రాంతంలో రాజీవ్ రహదారి ఇరుపక్కల చాలామంది రైతులు, చిరు వ్యాపారులు తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నా వీరి భద్రత గురించి ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. 

వాహనదారుల నిర్లక్ష్యం...

రాజీవ్ రహదారి పరిసరాల్లో రైతులు, చిరు వ్యాపారులు తాజా కూరగాయలుతాజా కూరగాయలు, పండ్లు, మొక్కజొన్న కంకులు నిత్యం విక్రయిస్తూనే ఉంటారు. తక్కువ ధరకే తాజా కూరగాయలు పండ్లు లభిస్తుందడంతో రాజీవ్ రహదారిపై వెళ్లే వాహనదారులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో రోడ్డుపైనే తమ వాహనాలు నిలిపి కొనుగోలు చేస్తుండంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ట్రాఫిక్ పోలీసులు సైతం రోడ్లపై నిలబడే వాహనాలకు జరిమానాలు వేయడంతోపాటు నిత్యం వ్యాపారులకు, వాహనదారు లకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయి నా వ్యాపారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు వాహనదారుల సై తం తమ వాహనాలు రోడ్డుపైనే నిలిపి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా బెజ్జం కి మండలం దేవక్కపల్లి లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గౌరారం పక్కనే ఉన్న సింగాయిపల్లి అటవీ ప్రాంతం అనుకొని సైతం మొక్కజొన్న కంకుల వ్యాపా రులు తమ వ్యాపారాలను నిర్వహిస్తుంటారు. రోడ్డుకు ఒక ఫీట్ కూడా దూరం లేని ఈ వ్యాపారాల వద్ద కొనుగోలు చేయడానికి వాహనదారులు రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు.

పట్టించుకోని ఆర్‌అండ్‌బి, అటవీశాఖలు.. 

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న రోడ్డు పక్కన వ్యాపారాలను ఆర్ అండ్ బి, అటవీశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు పక్కన, అడవుల పక్కనే వ్యాపారాలు నిర్వహించడం వల్ల వాహనదారులు కొనుగోలు చేస్తుండడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంత రాయం ఏర్పడుతుంది. అయినా ట్రాఫిక్ అంతరాయంతో వాహనాలు రోడ్లపై బాగా నిలిచిపోయి ప్రమాదాలకు దారితీస్తుంది.

నిత్యం ట్రాఫిక్ పోలీసులు వ్యాపారులకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తూ, జరిమానాలు విధిస్తున్నా, వ్యాపారాలు కొనసా గుతుండడం, ఆర్ అండ్ బి, అటవీ శాఖ అధికారులు వ్యాపారులకు, ప్రయాణికులకు ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో పాటు ఇతర చర్యలు చేపట్టకపో వడం గమనార్హం. ఇప్పటికైనా ఆర్ అండ్ బి శాఖ అటవీశాఖ అధికారులతో పాటు మా ర్కెటింగ్ శాఖ అధికారులు సైతం స్పందించి వ్యాపారులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించడం వల్ల ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారు.