02-10-2025 12:00:00 AM
ముస్తాబాద్,అక్టోబర్ 01(విజయక్రాంతి): యువత మత్తుకు బానిసలుగా మారి తమ జీవితాలు చేజేతుల నాశనం చేసుకుంటున్నారు. చిన్న వయస్సు లోనే తనువు చలిస్తూ కన్నవాళ్లకు శోకం మిగులుస్తున్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాన్ని యువతకు తెలియజేయడానికి తన వంతు బాధ్యతగా సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభాకర్ దసరా సెలవుల్లో గంజాయి డ్రగ్స్ వంటి ప్రణాంతక మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ బైక్ యాత్రను చేపట్టాడు.
గత 10 రోజులుగా చేపట్టిన యాత్రలో 2000 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ బుధవారం ముస్తాబాద్ కు ప్రభాకర్ యాత్ర చేరుకుంది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేటి యువత గంజాయికి అలవాటు పడి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
బతుకమ్మ,దసరా పండగలు సైతం లెక్క చేయకుండా గంజాయి మహమ్మారి బారిన పడకుండా అవగాహన కల్పించడమే లక్ష్యంగా బైక్ యాత్ర నిర్వహిస్తున్నానని, గంజాయి రహిత రాష్ట్రంగా మారినప్పుడే నిజమైన పండుగని తెలిపారు.ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ గ్రామ ప్రజలు తదితరులుపాల్గొన్నారు.