calender_icon.png 22 November, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమం చేస్తారా.. సమర్పిస్తారా ?

22-11-2025 12:50:30 AM

సౌతాఫ్రికాతో రెండో టెస్ట్

-సిరీస్‌లో 0- 1తో వెనకబడ్డ భారత్

-గాయంతో గిల్ ఔట్, కెప్టెన్‌గా పంత్

గుహావటి, నవంబర్ 21 : సొంతగడ్డపై ఏ జట్టయినా అత్యంత బలంగా ఉంటుంది. తమ పరిస్థితులు, తమకు అనుకూలమైన పిచ్ లతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తుంటాయి. భారత్ కూడా దీనికి మినహాయిం పేం కాదు. అసలు భారత్‌లో టెస్ట్ మ్యాచ్ గెలవాలనే ఆలోచనే విదేశీ జట్లకు ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు టీమిండియాను సొంతగడ్డపై ఓడించడం ఇక సులభమే అన్న రీతిలో పరిస్థితులు వచ్చేశాయి.

గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో సిరీస్ ఓటమి అంచున నిలవడమే దీనికి ఉదాహరణ. ఈడెన్ గార్డెన్స్‌లో అనూహ్యంగా పరాజ యం పాలైన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టుకు రెడీ అయింది. గుహావటి వేదికగా శనివారం నుంచి జరగబోయే మ్యాచ్ భార త్‌కు చావో రేవో అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ ను సమం చేసి పరువు దక్కించుకుంటుంది.

ఒకవేళ ఓడినా, డ్రాగా ముగిసినా సొంతగడ్డపై మరో సిరీస్ ఓటమి భారత్ ఖాతాలో చేరుతంది. అదే సమయంలో కెప్టెన్ శుభమన్ గిల్ మ్యాచ్ కు దూరమవడం మరో ఎదురుదెబ్బగా చెప్పాలి. దీంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఒత్తిడంతా భారత్ పైనే ఉంది. రెండో టెస్ట్ కోసం భారత తుది జట్టు ఎంపిక సవాల్ గా మారింది. గిల్ స్థానంలో నితీశ్ రెడ్డి జట్టులోకి వచ్చినా... నలుగురు స్పిన్నర్లలో ఒకరిని తప్పించడం ఖాయమైంది. దీంతో అక్షర్ పటేల్ స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి రానున్నాడు.

అయితే సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా.. నాలుగో ప్లేస్‌లో ఎవరిని ఆడిస్తారనేది చూ డాలి. బ్యాటింగ్ కోచ్ ఇచ్చిన హింట్ ప్రకా రం ధృవ్ జురెల్ గిల్ ఆడే స్థానంలో బ్యా టింగ్‌కు వచ్చే అవకాశాలున్నాయి. అటు బ్యాటర్లు రెండో టెస్టులో ఖచ్చితంగా రాణించాల్సిన పరిస్థితి ఉంది.  తొలి టెస్టులో ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే కారణం. దీంతో ఓపెనర్లతో పాటు మిడిలార్డర్ పైనా ఒత్తిడి నెలకొంది. బౌలింగ్ లో బుమ్రా, సిరాజ్ పేస్ ఎటాక్‌లో ఉండగా.. స్పిన్నర్లుగా జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లపైనే భారం ఉంది. ఇదిలా ఉంటే కోల్ కత్తా టెస్టులో భారత్ కు షాకిచ్చిన సౌతాఫ్రికా ఫుల్ జోష్‌లో ఉంది.

ఎందుకంటే భారత్ టూర్‌కు వచ్చినప్పుడు సఫారీలపై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే టీమిండియాలో టెస్ట్ గెలిచి 15 ఏళ్ళు దాటిపోయి ంది. దీంతో సౌతాఫ్రికా పోటీ ఇస్తే గొప్ప అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే ఈడెన్ టెస్టులో తక్కువ స్కోరుకే ఆలౌటై, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కూడా సమర్పించుకుని మ్యాచ్ గెలిచిందంటే దానికి కారణం బౌలర్ల ప్రతిభే. ముఖ్యంగా స్పిన్నర్ హార్మర్ సౌతాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే బ్యాటింగ్ లో కెప్టెన్ బవుమా కీలక ఇన్నింగ్స్ కూడా వారి విజయానికి కారణమైంది.

పిచ్ కు తగ్గట్టుగా జట్టును ఎంపిక చేసుకుని ఈడెన్ లో సౌతాఫ్రికా గెలిచింది. అటు పూర్తిగా పిచ్ నే నమ్ముకున్న భారత్ మాత్రం బోల్తా పడింది. ఈ నేపథ్యంలో గుహావటి పిచ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా పేస్ బౌలర్ రబాడా ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్ కు కూడా దూరమయ్యాడు. అటు స్పిన్ ఆల్ రౌండర్ ముత్తుసామిని తీసుకోవడంపై సౌతాఫ్రికా తర్జన భర్జన పడుతోంది. బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే ముత్తుసామి తుది జట్టులోకి రావొచ్చు.  

టైమింగ్స్‌లో మార్పులు 

గువాహటి టెస్టు టైమింగ్స్ మొత్తం మారనున్నాయి. ఈ స్టేడియం ప్రత్యేక భౌగోళిక స్థానం, కారణంగా సూర్యుడు త్వరగా ఉదయిస్తాడు. దీంతో మ్యాచ్ అరగంట ముందే అంటే 9 గంటలకే ప్రారంభమువుతుంది. అలాగే లంచ్ బ్రేక్ కు ముందే టీ బ్రేక్ ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు టీ బ్రేక్, మధ్యాహ్నం 1:20 గంటలకు లంచ్ బ్రేక్ ఉంటుంది. 

పిచ్ రిపోర్ట్ 

క్యూరేటర్ చెప్పిన వివరాల ప్రకారం ఆరంభంలో రెండు రోజులు పేసర్లకు, తర్వాత కాస్త బ్యాటర్లకు, చివరి రెండు రోజుల్లో స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు.

భారత తుది జట్టు (అంచనా)

జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధృవ్ జురెల్, పంత్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్

సౌతాఫ్రికా తుది జట్టు (అంచనా) 

మాక్రమ్, రికెల్టన్, ముల్దర్/బ్రెవిస్, డి జోర్జి, బవుమా (కెప్టెన్ ), స్టబ్స్, వెరెన్నే (కీపర్), బోస్చ్, జెన్సన్, హార్మర్, కేశవ్ మహరాజ్