26-09-2025 12:00:00 AM
రిజర్వేషన్లపై నేతల్లో ఉత్కంఠ నోటిఫికేషన్ కోసం నిరీక్షణ
మహబూబాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారంతో పల్లెల్లో ఎన్నికల సందడి ఊపందుకుంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజుల క్రితం ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పిటిసి స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి సీల్ కవర్లో భద్రపరిచినట్లు ప్రచారం సాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆమోదం తెలిపి ఆ మేరకు స్థానిక సంస్థల స్థానాలను ఖరారు చేసేందుకు అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయగా, ఆ మేరకు రిజర్వేషన్లను కూడా ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 193 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, జెడ్పిటిసి స్థానాలు 18, ఎంపీపీ స్థానాలు 18 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 482 గ్రామపంచాయతీలు ఉండగా 5,61,999 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం 1,066 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 63 మంది రిటర్నింగ్ అధికారులు, 63 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించడానికి ఏర్పాట్లు చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే ఈసారి జిల్లాలో సీరోల్, ఇనుగుర్తి కొత్త మండలాలు ఏర్పడ్డాయి.
బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ప్రభుత్వం కట్టుబడి 42 శాతం అమలు చేస్తే జిల్లా వ్యాప్తంగా గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీసీలకు మరిన్ని స్థానాలు పెరుగుతాయని, ఇతర సామాజిక వర్గాలకు సీట్లు తగ్గుతాయానే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటన అనంతరం రిజర్వేషన్ల అంశంపై సందిగ్ధత తొలిగిపోనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం గ్రామాల్లో వార్డు, గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాల వారిగా ఓటర్ల విభజన నిర్వహించారు. ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించి అనంతరం ఈనెల10న తుది ఓటర్ల జాబితా కూడా ప్రకటించారు. అలాగే ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు దాదాపు పూర్తి చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వెలువడమే తరువాయిగా మిగిలిందని చెబుతున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల్లో రిజర్వేషన్ల ప్రకటన ఉత్కంఠ నెలకొంది. చాలాకాలంగా స్థానిక సంస్థల ఎన్నికల ఆశల పల్లకిలో ఉన్న స్థానిక నేతలు ఎన్నికల బరిలో నిలిచేందుకు రిజర్వేషన్లు పెద్ద అడ్డంకిగా భావిస్తున్నారు. స్థానికంగా పోటీ చేసే స్థానాలు తమకు అనుకూలమైన రిజర్వేషన్లు రాకపోతే పరిస్థితి ఏమిటనే ఉత్కంఠ నెలకొంది. చాలాకాలంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులు ఇప్పుడు రిజర్వేషన్ల ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలలుగా స్థానిక సంస్థలు ఇప్పుడు అప్పుడు అంటూ దాటవేస్తుండగా, కొద్దిరోజుల క్రితం ఎన్నికల నిర్వాహన కోసం ప్రభుత్వం, అధికారులు ప్రక్రియ వేగవంతం చేయడంతో ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే ఆశా భావంతో ఉన్నారు. అయితే అనుకున్నది జరిగేది ఇంకొకటి అనే తరహాలో రిజర్వేషన్లు మారిపోతే ప్రత్యామ్నయం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏది ఏమైనా స్థానిక ఎన్ని‘కల’ నెరవేర్చుకోవడమే లక్ష్యంగా పల్లెల్లో స్థానిక నేతలు ఎన్నికల సమరం కోసం సన్నద్ధమవుతున్నారు.
మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు
మహబూబాబాద్ లో13, గూడూరు 17, కేసముద్రం 11, నెల్లికుదురు 13, ఇనుగుర్తి 6, డోర్నకల్ 10, మరిపెడ 15, కురవి 15, దంతాలపల్లి 11, నర్సింహులపేట 10, చిన్న గూడూరు 6, సీరోల్ 6, గంగారం 5, కొత్తగూడ 8, గార్ల 11, బయ్యారం 12, తొర్రూరు 15, పెద్దవంగర 9 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి.