09-10-2025 01:16:57 AM
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో బలమైన వాదనలు వినిపించాం
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, లింగంయాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం హైకోర్టులో బలమైన వాదనలు వినిపించామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టులో కేసు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 1930లో కుల సర్వే జరిగిందని, ఇప్పుడు అంటే 90 ఏళ్ల తర్వాత తెలంగాణలో కుల సర్వే జరిగిందని మహేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు. బీజేపీ బీసీల నోటికాడ ముద్దను లాగే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీసీల కోసం మూడు చట్టాలు తీసుకొచ్చామని, బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందని చెప్పారు.
మాదిగలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: సంపత్‌కుమార్
స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు బుధవారం ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం జనాభానే అత్యధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని తెలిపారు. పీసీసీ చీఫ్‌ను కలిసిన వారిలో విద్యా కమిషన్ సభ్యులు చారుకొండ వెంకటేష్, పార్టీ సీనియర్ నేత కొండేటి మల్లయ్య తదితరులున్నారు.