09-10-2025 01:07:18 AM
దరఖాస్తు రుసుం పెరగడం, ఎన్నికల ప్రభావమే కారణమా
దరఖాస్తులకు ఈ నెల 18 చివరి తేదీ
పది రోజుల్లో దరఖాస్తులు భారీగా పెరుగుతాయని ఆబ్కారీ శాఖ అంచనా
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : మద్యం షాపుల టెండర్లకు అబ్కారీ శాఖ ఊహించినంతంగా స్పందన రావడం లేదు. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం షాపులు ఉన్నాయి. 2025 సంవత్సరానికి ఈ నెల 18 వరకు వైన్‌షాపుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ నెల 23న మద్యం షాపులకు డ్రా తీసి.. కొత్తగా దక్కించుకున్న వారికి డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం దుకాణాలు కేటాయిస్తారు.
అయితే మద్యం దుకాణాల కోసం ఇప్పటీ వరకు కేవలం 1581 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం. గతంలో ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షలు మాత్రమే ఉండగా, ఇప్పుడు రూ. 3 లక్షలకు పెంచడం కూడా ఎక్కువగా దరఖాస్తులు రాకపోవడం కారణమనే వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది కూడా కేవలం దరఖాస్తుల ద్వారానే రూ. 3 వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
అయితే, ఇప్పటి వరకు దరఖాస్తులు ఎక్కువగా రాకపోవడానికి ఎన్నికల ప్రభావం కూడా ఒక కారణమని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. 2023 25 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.32 లక్షల దరఖాస్తులతో రూ. 2,645 కోట్ల ఆదాయం వచ్చింది. మద్యం షాపు టెండర్లకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 తేదీ వరకు అబ్కారీ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటీ వరకు ఆశించిన మేర దరఖాస్తులు రాలేదు.
అయితే చివరి 10 రోజుల్లో గతం కంటే ఎక్కువగానే దరఖాస్తులు వస్తాయని, చివరి మూడు రోజులు దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆబ్కారీ శాఖ లెక్కలు వేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు ఖమ్మం, నల్లగొండ , వరంగల్ తదితర జిల్లాల నుంచి దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నారు.
కేటగిరీ వారీగా వచ్చిన దరఖాస్తులు..
రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం షాపులకు గాను జనరల్ కేటరిగిలో 1,834 మద్యం షాపులు కేటాయించారు. వీటికి ఇప్పటీ వకు 992 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అంటే ఒక్కో మద్యం దుకాణానికి ఒక్కో దరఖాస్తు కూడా రాలేదు.
ఇక గౌడ సామాజిక వర్గానికి 15 శాతం అంటే 393 దుకాణాలు కేటాయించగా, 223 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఎస్సీలకు కేటాయించిన 262 దుకాణాలకు కేవలం 55 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక ఎస్టీలకు కేటాయించిన 131 షాపులకు గాను ఇప్పటీ వరకు 13 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.