16-09-2025 12:00:00 AM
ఎన్నికలకు సర్వం సిద్ధం
మహబూబాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ క్షణంలోనైనా ఎన్నికలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మహబూబాబాద్ జిల్లాలో 18 మండలాలు, 482 గ్రామపంచాయతీలు ఉండగా, ఈ నెల 8న ఓటర్ల ముసాయిదా ప్రకటన జారీ చేసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం అభ్యంతరాలను స్వీకరించి ఈ నెల 10న ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు.
జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్, కేసముద్రం, మరిపెడ, తొర్రూర్, డోర్నకల్ మున్సిపాలిటీలు మినహా మిగిలిన 18 మండలాల్లో మొత్తం ఓటర్లు 5,56,780 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో మహిళలు 2,83,064 ఉండగా, పురుషుల సంఖ్య 2,73,682 ఉండగా ఇతరుల సంఖ్య 24 ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 18 ఎంపీపీ స్థానాలు, 18 జెడ్పిటిసి స్థానాలతో పాటు 193 ఎంపీటీసీ స్థానాలను అధికారులు ఖరారు చేశారు.
బీసీలకు రిజర్వేషన్ల అంశం పై స్పష్టత రాగానే ఎన్నికలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సులు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్ ల భద్రత, రూట్ మ్యాప్ ఖరారు చేయడంతో పాటు బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మహిళా ఓట్లే అధికం
జిల్లాలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల సంఖ్య ఖరారు కాగా, పురుషుల ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 2,83,064 మంది మహిళ ఓటర్లు ఉండగా, 2,73,692 పురుష ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే జిల్లాలో 9,372 మహిళా ఓటర్లు అధికంగా ఉండడం విశేషం. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. స్థానిక ఎన్నికల్లో సైతం ఇదే ఒరవడి కొనసాగుతోంది. గెలుపు ఓటములను మహిళా ఓటర్లు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.
ఎంపీటీసీ స్థానాల వివరాలు ఇలా..
తొర్రూరు: 15, సిరోలు: 6, పెద్ద వంగర: 9, నెల్లికుదురు: 13, నరసింహుల పేట: 10 మరిపెడ: 15, మహబూబాబాద్: 13, కురవి: 15, కొత్తగూడ: 8, కేసముద్రం: 11, ఇనుగుర్తి: 6, గార్ల: 11, గూడూర్: 17, గంగారం: 5, డోర్నకల్: 10, దంతాలపల్లి: 11, చిన్న గూడూరు: 6, బయ్యారం: 12,
స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
మహబూబాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసాం. జిల్లావ్యాప్తంగా 18 మండలాల పరిధిలో 482 గ్రామపంచాయతీలు ఉండగా, వాటిల్లో 4,110 వార్డులు ఉన్నాయి. ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్స్ లను కూడా సిద్ధం చేశాం. తుది ఓటర్ల జాబితా ముద్రణ పూర్తి చేసాం. ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆదేశిస్తే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తేదీ ప్రకటిస్తే బ్యాలెట్ పత్రాలను ముద్రించడమే మిగిలింది.
- జే.హరి ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి, మహబూబాబాద్