15-08-2025 01:40:12 AM
-ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు
-పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం
-తెగిన ఫీడర్ ఛానల్.. మునిగిన పంటలు..
-వరద నీటిలో పలు కాలనీలు
-బ్రిడ్జిల వద్ద పహారా కాస్తున్న పోలీసులు
-అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
-ప్రత్యేక కంట్రోల్‌రూములు ఏర్పాటు
రంగారెడ్డి, ఆగస్టు 14 (విజయ క్రాంతి) : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనం అల్లాడు తున్నారు. పల్లె నుంచి పట్నం దాకా ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్ళొద్దని అధికారులనుసైతం హెచ్చరికలతో మెజార్టీగా ప్రజలు తమ ఇండ్లకు పరిమితం అయ్యారు. రోజువారి కూలీలు, రైతులు, ఉద్యోగులు తప్పని పరిస్థితుల్లో పొట్ట కూటి కోసం బయటకు వెళ్తున్నారు.
భారీ వర్షాలతో జిల్లాలో పలు గ్రామాల్లో బ్రిడ్జిలు కొట్టుకపోవడం, వాగులు వంకలు పారడంతో రాకపోకలు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయా గ్రామాల వద్ద పొంగిపొర్లుతున్న వాగుల వంకల వద్ద అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తు న్నారు. పలు గ్రామాల్లో పంట చేను నీటి మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం జిల్లాలోని 27 మండలాల్లో సరాసరిగా 2.5 సెంటీమీటర్ల వర్షం కురువగా.... జిల్లాలో ఇప్పటివరకు ఆగస్టు నెలలో 153 మి. మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
గ్రామాలకు నిలిచిన రాకపోకలు..
భారీ వర్షాలకు వాగులు పొంగడంతో పలు చోట్ల రాకపోకలు బంద్ అవుతున్నాయి. వరద దాటికి కొందుర్గు %--% గంగన్న గూడెం రహదారిపై పెద్దపెద్ద గుంతలు పడడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తామని పాలకులు హామీ ఇచ్చినా నెరవేర్చకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అయ్యవారిపల్లి వాగు ప్రమాదకరం ప్రవహిస్తుండడంతో పలు గ్రామలకు రాకపోకలు స్తంభించాయి. గతంలో ఇక్కడ పోసిన మట్టి కొట్టుకుపో వడంతో వాహనదారులు ఇతర గ్రామాల మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. షాద్ నగర్ పరిధిలోని నాగులపల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో వరద పొంగుతుండడంతో ఈ ప్రాంతాలకు కనెక్షన్ కట్ అయ్యింది.
ఈ వాగుల వద్ద పోలీసులు బారికేడ్లే ఏర్పాటు చేసి.. ప్రజలు అక్కడి వెళ్లకుండా కాపలా ఉంటున్నారు. తలకొండపల్లి మండలం చంద్రదాన గ్రామంలోని నిరుడు ఫీడర్ ఛానల్ తెగిపోవడంతో ప్రస్తుతం వర్షపు నీరంతా వృథాగా పోతోంది. ఏడాదిగా ఫీడర్ ఛానల్ కు మరమ్మతు చేయాలని ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని, లేదంటే నల్లచెరువు నిండేదని రైతులు వాపోతున్నారు. ఆమనగల్, కడ్తల, తలకొండపల్లి,మాడుగుల, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, మహేశ్వరం లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. మీర్పేట్,బడంగ్పేట్ కార్పొరేషన్‌లో పలు లోతట్టు కాలనీలో నీట మునిగాయి. ౪ రోజుల నుంచి మిథిలా నగర్ లో నలువైపులా వరద నీరు చుట్టుముట్టింది.
తుక్కుగూడ శ్రీశైలం,హైదరాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రత్యేకంగా ఆయా మండలాల్లో, మున్సిపాలిటీలో వివిధ శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం కల్వకుంట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితిలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే వారిని కాపాడేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా రివ్యూలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖల అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి వెంటనే కాల్ చేయించి అట్టి ప్రజలను పునరావస కేంద్రం తరలించాలన్నారు. పల్లెల్లో ప్రత్యేకంగా భారీ వర్షాలు నేపథ్యంలో టామ్ టామ్ వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని చెరువులు కుంటలు తెగిపోయే పరిస్థితి ఉంటే అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆయన పేర్కొన్నారు. విధినిర్వన్లో నిర్లక్ష్యంగా ఉన్న వారి పైన తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు అలర్ట్‌గా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.