29-11-2025 01:04:38 AM
భక్త సంద్రంలో ముంచిన భజన గీతాలహరి
పటాన్ చెరు, నవంబర్ 28 :స్వామియే శరణమయ్యప్ప.. హరి హరి వాసనే శరణమయ్యప్ప అంటూ వేలాదిమంది అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ మార్మోగింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు.అభ్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. దేవత మూర్తుల ఉత్సవ విగ్రహాలతో ప్రాంగణం మొత్తం శోభాయమానంగా తీర్చిదిద్దారు. శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయం నుండి వచ్చిన ప్రత్యేక పూజారులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్విరామంగా కొనసాగాయి. ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేసి సర్వంగా సుందరంగా రంగురంగుల పువ్వులతో అలంకరించారు.
ముందుగా శ్రీ విఘ్నేశ్వర, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ అయ్యప్ప చిత్రప టాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం నిర్వహించారు. పదునెట్టంబడిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వాముల పెటతుల్లి భక్తులను ఆకట్టుకుంది. అనంతరం పదునెట్టంబడిపై దీపాలు వెలిగించారు.సుమారు 10 వేల మంది భక్తులు కార్యక్రమానికి హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు.