06-05-2025 01:06:24 AM
నల్లగొండ, మే 5 (విజయక్రాంతి) : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అక్రమాల పర్వం నడుస్తోంది. అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. కండ్ల ముందే అనరులు రూ.లక్షల్లో జీతాలు ప్రతినెలా డ్రా చేస్తున్నా.. వారికి వంత పాడుతున్నారే తప్ప వారిపై చర్యలకు మాత్రం దిగడం లేదు. ఎంజీయూలో 13 ఏండ్ల క్రితం 31 మంది అధ్యాపకులు అరత లేకున్నా అసిస్టెంట్ ఫ్రొఫెసర్లుగా అమ్యామ్యాలు అప్ప జెప్పి కొలువులు సాధించారు.
రిక్రూట్ అయిన ఏ ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఏపీఐ(అకడమిక్ పర్ఫామెన్స్ ఇండికేటర్) స్కోర్ 30 దాటింది లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అధ్యాపకులైతే.. ఏకంగా పీజీ కంప్లీట్ కావడానికి ముందే బోధనానుభవం సర్టిఫికెట్లు సమర్పించడం కొసమె రుపు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీలు వీరి నియామకం రద్దు చేయాలంటూ నివేదికలు ఇచ్చినా..
యూనివర్సిటీ అధికారులు మాత్రం వారికి వంతపాడుతుండడం గమనారం. ఇటీవల అక్ర మంగా నియామకమైన సదరు 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను అసోసియేట్ ఫ్రొఫెసర్లుగా నియమించేందుకు ఎంజీయూ నోటి ఫికేషన్ రిలీజ్ చేయడం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే సదరు అధ్యా పకుల అంశం కోర్టులో పరిధిలో ఉన్న సమయంలో పదోన్నతులకు నోటిఫికేషన్ ఇవ్వ డం నిబంధనలకు విరుద్ధమని తెలుస్తోంది.
అసలు నియామకమే అక్రమం..
32 మంది అధ్యాపకులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించేందుకు సెప్టెంబరు 2011లో నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే 2012 ఫిబ్రవరిలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 32 మందిని అప్పటి వీసీ కట్టా నర్సింహారెడ్డి రిక్రూట్ చేసుకున్నారు. అయితే ఈ అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ నియామకంలో రూ.లక్షలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి.
ఒక్క కెమిస్ట్రీ విభాగంలోనే 2012 ఫిబ్రవరి 4న ఒకే రోజు ఏకంగా 289 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. రెండు రికార్డులను మెయింటెన్ చేశారు. యూజీసీ నిబంధనలకు పాతరేసి.. రోస్టర్ విధానాన్ని పాటించలేదు. నిజానికి ఎంపికైన అభ్యర్థికి ఏపీఐ(అకడమిక్ పర్ఫామెన్స్ ఇండికేటర్) స్కోర్ 300 ఉండాలి.
కానీ ఎంజీయూ అధికారులు ఎంపిక చేసిన ఏ ఒక్క అభ్యర్థికి స్కోర్ 30 మించకపోవడం కొసమెరుపు. ఇంటర్వ్యూలను వీడియో రికార్డు చేశామంటూ రూ.88వేలు బిల్లు పొందడం గమనారం. 170 వరకు డీవీడీలు ఉన్నట్టు బిల్లు సైతం సృష్టించారు. ఆడిట్ బృందానికి ఇవేవీ చూపించలేదు.
13 ఏండ్లుగా కొనసాగుతున్న వివాదం
అప్పటి పాలకమండలి నియామక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ 2012లోనే తీర్మానించారు. దీంతో 32 మంది అధ్యాపకులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వడంతో దానిపైనే 13 ఏండ్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ వ్యవహారంపై గత ప్రభుత్వాలు పలు కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల నివేదికల ప్రకారం వారి తొలగింపుపై ముఖ్యమంత్రుల సంతకాలు జరిగాయి.
కానీ కోర్టు స్టేతో ఇప్పటివరకు అధ్యాపకులు కాలం నెట్టుకొస్తున్నారు. ఇదే తరహాలో కాకతీయ యూనివర్సిటీలోనూ వివాదం నెలకొంటే.. అధ్యాపకులను పూర్తిగా తొలగించారు. కానీ ఎంజీయూలో మాత్రం అనరులకు అధికారులు వంత పాడుతున్నారు.
అయితే రిక్రూట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు 32 మందిలో ఒకరు ఇతర ఉద్యోగానికి వెళ్లగా, మిగిలిన 31 మంది అధ్యాపకులు 13 ఏండ్లుగా కోర్టు స్టే పేరుతో దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరో పదేండ్లు పోతే రిటైర్‌మెంట్ కావడం ఖాయం. ఎంజీయూ అధికార యంత్రాంగం రిటైర్ అయ్యేంత వరకు స్పందించే పరిస్థితి కన్పించడం లేదు.
నోరుమెదపని స్టాండింగ్ కౌన్సిల్..
అధ్యాపకులను తొలగిస్తూ పాలకమండలి తీసుకున్న నిర్ణయంపై 31 మంది అధ్యాపకులు కోర్టును ఆశ్రయించారు. అయితే యూనవర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తోంది. ఈ కేసు బెం మీదకు వచ్చిన ప్రతిసారి స్టాండింగ్ కౌన్సిల్ తరపు న్యాయవాది నుంచి ఎలాంటి కౌంటర్ ఉండడం లేదు. దీంతో గతంలో ఉన్నత విద్యామండలి సైతం సీరియస్ అయ్యింది.
యూనవిర్సిటీ కేసులను వాదించేందుకు స్టాండింగ్ కౌన్సిల్ తరపు న్యాయవాది ఉన్నప్పటికీ కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. యూనివర్సిటీలో దాదాపు 100కి పైగా కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. కానీ కౌన్సిల్ తరపు న్యాయవాది మాత్రం కౌంటర్ దాఖలు చేయడం లేదు. నిజానికి కోర్టు కేసులు వాదించడానికే ఎంజీయూ నెలకు రూ.30వేలు వేతనం చెల్లిస్తోంది.
ఈ వ్యవహారాన్ని గమనించిన వీసీ అరవింద్‌కుమార్ 2021 ఫిబ్రవరి నుంచి జీతం ఆపేయడంతో పాటు కౌన్సిల్‌ను తొలగించాలని ప్రభుత్వానికి లేఖ రాయడం కొసమెరుపు. మరీ ఇప్పటికైనా ఆ 31 మంది అధ్యాపకులపై చర్యలు తీసుకుంటారా..? లేక కోర్టు స్టే పేరు చెప్పి రిటైర్‌మెంట్ అయ్యేంత వరకు వేచి ఉంటారో చూడాల్సిందే.