06-05-2025 01:02:30 AM
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లుఓవర్ వర్క్ సరిగా జరగట్లేదని..అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నామని పది నెలల్లో ఉప్పల్ ఫ్లుఓవర్ పూర్తి చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పనులు వేగంగా చేసేందుకుగాను ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌ను తప్పించి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించామని పేర్కొన్నారు.
రూ.175కోట్లతో 4 వరుసల్లో నిర్మించిన అంబర్‌పేట ఫ్లుఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగసభలో ప్రసంగించారు.. ‘అందరికీ నమ స్కారం.. బాగున్నారా..’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పెండింగ్‌లో భూసేకరణపై రాష్ర్ట ప్రభుత్వం ఫోకస్ చేయాలని కోరారు. రాష్ట్రమంత్రులు కోమటిరెడ్డి, పొన్నం భూసేకరణ త్వరగా పూర్తి చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ ఐటీ సిటీ, ఫార్మా రంగం కూడా పెద్దదని..ఇన్నోవేషన్, ఇంట్రప్రెన్యూర్‌లోనూ ఎంతో నైపుణ్యం ఉన్న సిటీ అని కొనియాడారు. దేశంలోని ఎన్నో నగరాల నుంచి హైదరాబాద్‌కు వస్తుంటారని..అందుకే ఇక్కడి నుంచి అన్ని ప్రధాన నగరాలను కనెక్ట్ చేసేలా జాతీయ రహదారులు అభివృద్ధి చేశామన్నారు. ఇండోర్-హైదరాబాద్ కారిడార్ పరిధిలో తెలంగాణ భాగం పనులు పూర్తి చేశామన్నారు.
మహారాష్ర్టలో కూడా పనులు త్వరగా పూర్తిచేస్తామన్నారు. ఈ కారిడార్ పూర్తయితే 20 గంటల ప్రయాణం 10 గంటల్లోనే పూర్తి అవుతుందన్నారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్-విజయవాడ 4 లేన్ రోడ్డును 6లేన్ రోడ్డుగా మార్చుతామన్నారు. నాగ్‌పూర్‌లో డబుల్ డెక్కర్ ఎయిర్‌బస్ అందుబాటులోకి తెచ్చామన్నారు.
చాలా సుందరమైన సౌకర్యాలు ఉన్న ఈ బస్సులో ఎయిర్ హోస్టెస్ లాగా బస్ హోస్టెస్ కూడా ఉంటారని తెలిపారు. సాధారణ బస్సుల కంటే వీటిలో 3 శాతం చార్జి తక్కువ ఉంటుందన్నారు. హైదరాబాద్ రింగ్‌రోడ్డుపై ఈ ఎయిర్ బస్‌ను ట్రై చేయాలని తెలంగాణ మంత్రులను కోరారు. సీఎన్జీ, ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలని రాష్ర్టమంత్రులను కోరుతున్నామన్నారు.
రైతన్నలు వ్యవసాయంలో కూడా పర్యావరణహిత వాహనాలను వాడాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క స్మార్ట్ నగరాలతోనే దేశం అభివృద్ధి చెందదని స్మార్ట్ గ్రామాలు కూడా కావాలన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, అనిల్‌కుమార్‌యాదవ్, మేయర్ విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు.
ఫ్లు ఓవర్ల మంత్రి గడ్కరీ : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
జాతీయ రహదారుల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని..ఫలితంగా మరణాలు కూడా తగ్గినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆమెరికాను తలదన్నేలా జాతీయ రహదారులు ఉన్నాయన్నారు. నితిన్ గడ్కరీ దగ్గరకు ఏ పార్టీ ఎంపీ వెళ్లి అడిగిన కాదనకుండా ప్రాజెక్టులను మంజూరు చేస్తారని. .అనేక ఫ్లుఓవర్లు ఆయన హయాంలోనే నిర్మితమయ్యాయని అందుకే ఆయన్ను ఫ్లుఓవర్ల మంత్రి అని పిలుస్తారని తెలిపారు.
బీహెచ్‌ఈఎల్ హైవే ఫ్లుఓవర్, ఆరాంఘర్ ఫ్లు ఓవర్, అంబర్‌పేట్ ఫ్లుఓవర్ వంటి మల్టీలెవెల్ ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది గడ్కరీయేనన్నారు. ఫ్లుఓవర్ కింద సర్వీస్ రోడ్డుల కోసం 6 చోట్ల భూసేకరణ ఇంకా పెండింగ్‌లో ఉందని..రాష్ర్ట ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని ఈ భూసేకరణ పూర్తిచేయాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ నినాదాలు
అంబర్‌పేట ఫ్లుఓవర్ ప్రారంభోత్సవ సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తల మధ్య కాసేపు ఉద్రిక్తత చోటుచేసు కుంది. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. గడ్కరీ కాన్వా య్‌ను కాంగ్రెస్ నేతలు అడ్డుకోగా..పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టి కాన్వాయ్‌ను ముందుకు పంపించారు.
బీహెచ్‌ఈఎల్-లింగంపల్లి ఫ్లుఓవర్ ప్రారంభం..
సంగారెడ్డి, మే 5(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని ముంబై జాతీయ రహదారిపై బీహెచ్‌ఈఎల్-లింగంపల్లి వద్ద రూ.136 కోట్లతో నిర్మించిన ఫ్లుఓవర్ బ్రిడ్జిని సోమవారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పటాన్‌చెరులోని ఇక్రిశాట్ వద్ద హెలీప్యాడ్‌లో ల్యాండింగ్ అయి రోడ్డు మార్గంద్వారా ఫ్లు ఓవర్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి గడ్కరీని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, కలెక్టర్ క్రాంతి వల్లూరు, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంబంధిత శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.