calender_icon.png 8 November, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై పోరాడుదాం

08-11-2025 05:53:07 PM

తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి

నకిరేకల్ (విజయక్రాంతి): అంగన్వాడీల సమస్యల పరిష్కారం, ఐసీడీఎస్ (ICDS) పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ​నకిరేకల్‌ పట్టణంలోని విష్ణు ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(CITU) నల్గొండ జిల్లా 5వ మహాసభలను నిర్వహించారు. ఆ సంఘం పతాకాన్ని ఆవిష్కరించి, అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐసీడీఎస్ వ్యతిరేక విధానాలపై అంగన్వాడీలు ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆమె కోరారు. 

కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేయడానికి కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చి, అందులో భాగంగా పీఎంసీ (PMC) స్కూళ్లను తీసుకొచ్చి అంగన్వాడీలకు పోటీగా నిలిపిందని ఆమె ఆరోపించారు. ప్రతి బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు నిధులను తగ్గిస్తూ నిర్వీర్యానికి పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అధికారంలోకి వస్తే ₹18,000 వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిగా విస్మరించిందని గుర్తు చేశారు. ఈ మహాసభల్లో ప్రభుత్వ విధానాలపై చర్చించి, సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో పోరాటాలను నిర్వహించేందుకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆమె తెలిపారు.​ సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం కార్మికులపై పెద్ద ఎత్తున దాడి చేస్తోందని, 24 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లను తీసుకొస్తుందని విమర్శించారు.

దీనివల్ల కార్మికులకు ఇప్పటివరకు ఉన్న అనేక హక్కులు హరించబడి, పనిగంటలు 8 నుంచి 10 గంటలకు పెరుగుతాయని, కనీస వేతనాలు, సమ్మె చేసే హక్కు కోల్పోతామని, పని భారం పెరుగుతుందని హెచ్చరించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.​ఈ మహాసభల అధ్యక్ష వర్గంగా పొడిచేటి నాగమణి, ఇంద్రకంటి సైదమ్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.డి. సలీం, నాయకులు లకపాక రాజు, వంటపాక వెంకటేశ్వర్లు, అవుట రవీందర్, శ్రామిక మహిళా రంగం జిల్లా కార్యదర్శి బులక్మి, యూనియన్ కార్యదర్శులు బి. పార్వతి, దాడి అరుణ, సునంద, సముద్రమ్మ, పద్మ, రాధాబాయ్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.