08-11-2025 05:41:16 PM
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటా..
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్..
జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): ప్రజా జీవితంలో ఇతరులపై బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారిందని, తనపై నిరాధార ఆరోపణలు చేయటం మానుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ భూముల అన్యాక్రాంతంలో 73 ఏండ్ల క్రితం జరిగిన విషయాన్ని 7 ఏండ్ల క్రితం ఎమ్మెల్యే అయిన తనపై మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రావణి ఆరోపణలు చేయడం అర్థరహితమన్నారు. జగిత్యాలలో తనకు వ్యాపారవేత్తలతో సహా అన్ని వర్గాల వారు స్నేహితులుగా ఉన్నారని, అంతమాత్రాన వారు చేసే ప్రతి పనికి తాను ఎలా బాధ్యత వహిస్తానని అన్నారు.
ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతంపై తన మద్దతు ఎప్పటికీ ఉండదన్నారు. తనపై ఆరోపణలు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ అదే వివాద కాంప్లెక్స్ లో వ్యాపార సంస్థల ప్రారంభోత్సవానికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఎంపీ ఎన్నికల సందర్భంగా భూ కబ్జా ఆరోపణలు చేసిన వ్యాపారవేత్త ఇంటికి వెళ్ళి అల్పాహారం చేసిన విషయం జగిత్యాల ప్రజలకు తెలుసన్నారు. చట్ట వ్యతిరేక విధానాలకు మద్దతు ఇవ్వడం తనకు గాని తన కుటుంబానికి గాని అవసరం లేదన్నారు. తన జీవితం తెరచిన పుస్తకమని జగిత్యాల ప్రజలందరికీ తెలుసన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేయడం వల్లనే ఆ బురద కడుక్కోవడానికి, ప్రజలకు అన్ని విషయాలు తెలియాలనే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్నారు. ఏ విషయంలో నైనా మీడియా ప్రతినిధులకు వివరణ ఇస్తానని, తనపై అసత్య ప్రచారాలు,వార్తలు రాయవద్దని ఎమ్మెల్యే కోరారు.
అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద బ్యాంక్ లోన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సేకరించి అన్ని మున్సిపాలిటీల కంటే అత్యధికంగా జగిత్యాల కు రు.50 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. అయితే ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అవగాహన లేకుండా శ్రావణి మాట్లాడడం అర్థరహితమన్నారు. ఒకవేళ కేంద్రమే నిధులు మంజూరు చేస్తే ఎంపీ అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ కార్పొరేషన్ కంటే జగిత్యాల మున్సిపల్ కు అత్యధికంగా నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రాష్ట్రాలకు అప్పుగా ఇచ్చిన ఈ నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 ఏండ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా జగిత్యాలకు రు. 50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు రు.12.50 కోట్లు మొత్తంగా రు.62.50 కోట్లు, రాయికల్ పట్టణ అభివృద్ధికి రూ. 15 కోట్లు మంజూరు చేయటం జరిగిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజల డబ్బు ప్రజలకు అందించే విదంగా కృషి చేయటం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని, జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం తాను నిధులు తెస్తే ఓర్వలేకనే అభివృద్దికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రీయ విద్యాలయం, జగిత్యాల-తిప్పన్నపేట్ బ్లాక్ స్పాట్ రోడ్డు, రోళ్ళవాగు పర్యావరణ అనుమతులు తదితర ప్రతిపాదనలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లడం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అని అన్నారు. 138 సర్వే నంబర్ భూమిలో ఉన్న కృష్ణ పెట్రోల్ బంక్,బాలకృష్ణ బార్ స్వాగత్ బార్ తదితర వ్యాపార సముదాయాలు జగిత్యాల మున్సిపల్ కు సంబంధించిన భూమిలో చట్ట విరుద్ధం గా ఉన్నట్లయితే ఆ సముదాయాలపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతూ లేఖ రాసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు గోలి శ్రీనివాస్, బాలే శంకర్, క్యాదసు నాగయ్య, చెట్పల్లి సుధాకర్, ముస్కు నారాయణ రెడ్డి, కుసరి అనిల్, దుమాల రాజ్ కుమార్, బద్దం జగన్ తదితరులున్నారు.