22-11-2025 02:10:58 AM
ముషీరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం దేశంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని, అం దుకు రాజ్యాంగ సవరణ కోసం కాంగ్రె స్, బీజేపీలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరా రు. శుక్రవారం కాచిగూడలోని ఓ హోటల్‌లో ‘బీసీ రిజర్వేషన్లు,- సర్పంచ్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ’పై బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
136 కుల సం ఘాల రాష్ట్ర అధ్యక్షులు, 40 బీసీ సంఘాల అధ్యక్షులు, అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు, 20 ఉద్యోగ సంఘాల నేతలు, అన్ని యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. బీసీలను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుందని, చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలని కోరుతుంటే పార్టీ పరంగా ఇస్తామంటూ మాట మారుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్ ఎన్నికలకు ముందే సీఎం నేతృత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని, రాహుల్ గాంధీ ద్వారా పార్లమెంటులో ప్రవేటు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని అందులో భాగంగానే ఈ నెల 25న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం, 30న బీసీల రాజకీయ యుద్ధభేరి సభ, డిసెంబరు 9న పార్లమెంట్ ముట్టడి ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు.
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ముందుకు సాగాలన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని చెప్పారు. టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు మాట్లాడుతూ.. బీసీలలో వస్తున్న ఉద్యమాన్ని గుర్తించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి ఈ పార్లమెంట్ సమస్యలను ఆమోదించాలని కోరా రు.
సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్‌కుమార్‌తో మాట్లాడి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లడం, రాహుల్ గాంధీతో మాట్లాడి పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లు ప్రైవేట్ బిల్లు కాంగ్రెస్ పార్టీ పెట్టెల కృషి చేస్తామన్నారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు దేశంలో 50 శాతం సీలింగ్ దాటినప్పుడు లేని అభ్యంతరాలు బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే కోర్టులకు ఎందుకు అభ్యంతరాలని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ పలు తీర్మానాలు చేసింది. వాటిలో కొన్ని 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా నిర్వహించే గ్రామపంచాయతీ ఎన్నికలను తక్షణమే ఆపివేయాలి, పార్టీలపరంగా రిజర్వేషన్‌ను అంగీకరించబోమన్నా రు. సర్పంచ్ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని తీర్మానించారు.
సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, సినీ దర్శకుడు ఎన్ శంకర్, తెలంగాణ విఠల్, బీసీ కుల సంఘాల వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో-చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, ప్రొఫెసర్ సంఘనీ మల్లేశ్వర్, ప్రొఫె సర్ బాగయ్య తదితరులు పాల్గొన్నారు.