26-05-2025 12:10:28 AM
రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో, రూపేశ్, ఆకాంక్షసింగ్ నాయకానాయికలుగా నటించగా, పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేశ్ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “షష్టిపూర్తి’ టైటిల్ కథ నా వద్దకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. వయసుకు తగ్గ పాత్రలు నాకు ఒక్కడికే వస్తున్నాయా? అని ఆశ్చర్యం కలిగింది. నేను నిజ జీవితంలో షష్టిపూర్తిని తప్పించుకోవాలని ప్రత్నించాను. కానీ ఇలా సినిమా రూపంలో ‘షష్టిపూర్తి’ జరిగింది. అది నటుడిగా నా అదృష్టం. పెళ్లి సమయంలో నా పాటే.. చావు సమయంలో నా పాటే.. ఇక షష్టిపూర్తి టైమ్‌లో పాట లేదండి అని కొందరు అనేవాళ్లు.
ఇప్పుడు ఆ పాట కూడా వచ్చింది. ఆ పాటను ఇళయరాజా చేయడం మరో అదృష్టం. తెలుగు సంస్కృతీ సంప్రదాయాల్ని చాటి చెప్పేలా మా చిత్రం ఉంటుంది. తల్లిదండ్రుల పెళ్లిని బిడ్డలు చూడలేరు. అలా బిడ్డలు చూడగలిగే తల్లిదండ్రుల పెళ్లే మా ఈ ‘ష్టిపూర్తి’. ఇది మన తెలుగువారందరి సినిమా” అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. “షష్టిపూర్తి’ లాంటి చక్కటి కార్యక్రమంలో పాలుపంచుకోవటం ఆనందంగా ఉంది.
రాజేంద్రప్రసాద్ ఎప్పుడూ నాకు అండగా నిలిచారు. ఆయన సినిమా చూస్తే చాలు మా కష్టాలు, ఒత్తిళ్లన్నీ పోతాయి. ఈ మాటలు నేను కాదు.. సాక్ష్యాత్తూ పీవీ నరసింహారావు అన్న మాటలే. కుటుంబ విలువల్ని చాటి చెప్పేందుకు ఈ సినిమా వస్తోంది. ఇలాంటి సినిమాలు సమాజం కోసం సక్సెస్ అవ్వాలి” అని తెలిపారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. “నాకు ఎన్టీఆర్ తర్వాత రాజేంద్రప్రసాద్ అంటే ఇష్టం. ‘షష్టిపూర్తి’ సినిమా పెద్ద విజయం సాధించాలి” అన్నారు.
హీరో, నిర్మాత రూపేశ్ మాట్లాడుతూ.. “ఇంత మంచి కథ నావద్దకు రావడం నా అదృష్టం. రాజేంద్రప్రసాద్‌తోనే ఇకపై సినిమాలన్నీ చేయాలనిపిస్తోంది. అర్చనమ్మతో షూటింగ్ చేస్తుంటే.. ఇంట్లో అమ్మతో ఉన్నట్టు అనిపించేది” అని చెప్పారు. నటి అర్చన మాట్లాడుతూ.. “రాజేంద్రప్రసాద్ ఓ సినిమాలో ఉంటే.. అందులో అన్నీ ఉన్నట్టే. ఏ పాత్రలోకైనా, ఏ సినిమా అయినా ఆయన పరకాయ ప్రవేశం చేస్తారు.
మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఈరోజుల్లో ఓ సినిమా తీయడం, ముగించడం ఓ యాగం, విష పరీక్షలాంటిది. ఇలాంటి ఓ సినిమాను తీయడం అంత సులువు కాదు” అన్నారు. హీరోయిన్ ఆకాంక్ష మాట్లాడుతూ.. “ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం.
ఈ మూవీతో నాకు మంచి ఫ్యామిలీ దొరికింది. ఈ చిత్రం అందరినీ ఏడిపిస్తుంది.. నవ్విస్తుంది.. భావోద్వేగాలతో కదిలిస్తుంది” అని చెప్పింది. దర్శకుడు పవన్ ప్రభ, పాటల రచయిత చైతన్యప్రసాద్, ఇతర చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.