07-01-2026 12:00:00 AM
నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు
నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్, జనవరి 6 (విజయక్రాంతి): మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కొండల్ వాడి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నీరడి గణేష్, నీరడి ఆదిత్య, మరొక యువకుడు హంకర్ వారి ప్రకాష్,నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన మరొక యువకుడు బలే సాయిరాం లు మోటారు వాహన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి కారకుడైన లారీ డ్రైవర్ వకీల్ జైభగవాన్ కు రెండు సంవత్సరాల కఠిన కారాగార, రెండు వేల రూపాయలు జరిమానా విదిస్తూ నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి జి. వి. ఎన్ భారత లక్ష్మీ మంగళవారం తీర్పు చెప్పారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాలు. గణేష్, ఆదిత్య, ప్రకాష్, సాయిరాం లు 12 మార్చి, 2023 న మారుతీ కారులో వ్యక్తిగత పనులపై హైదరాబాద్ కు వెల్లి పనులు ముగించుకుని తిరిగి నిజామాబాద్‌కు బయలుదే రారు వీరి కారు ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామ శివారుకు రాగానే రేడియం స్టిక్కర్స్ అతికించని ఎర్ర జెండాలు వెనుకకు కట్టని లారీని వెనుక నుండి డీకొట్టడంతో కారులో ఉన్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన వకీల్ 68 టైర్లతో కూడిన భారీ లారీని డ్రైవ్ చేసుకుంటు వెళుతున్నాడు. అతనికి తోడుగా లారీ మేనేజర్ సతీష్ శర్మ ఉన్నారు.
మోటారు వాహన భద్రత నిబంధనల మేరకు వెనుక వచ్చే వాహనాల లైట్ల వెలుతురులో ముందు ఉన్న వాహనం కనపడే విదంగా రేడియం స్టిక్కర్స్, ఎర్రజెండాలు కట్టకుండా నిర్లక్ష్యం వహించినందున వారిపై భారత శిక్షస్కృతి సెక్షన్ 304 పార్ట్ 2( నేర పూరిత నిర్లక్ష్యం వలన వేరొకరి ప్రాణాలు పోతాయని తెలిసి) 304(ఎ) (నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం) సెక్షన్ లలో నేరారోపణలు మోపారు. కాని కోర్టు నేర న్యాయ విచారణలో సెక్షన్ 304 పార్ట్ 2 నేరారోపణ రుజువు కాలేదని సెషన్స్ కోర్టు పేర్కొంది. ఐపిసి సెక్షన్ 304(ఎ) నేర పూరిత నిర్లక్ష్యం వలన లారి వెనుక రేడియం స్టిక్కర్స్ అతికించకుండ, ఎర్ర జెండాలు కట్టకుండా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ వకీల్ కు రెండు సంవత్సరాల కఠిన జైలుశిక్షతోపాటు రెండు వేల రూపాయల జరిమానా విదిస్తూ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు చెప్పారు.