07-01-2026 12:00:00 AM
బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర..
బాన్సువాడ, జనవరి 6 (విజయక్రాంతి): బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా రోల్కాల్ను పరిశీలించి, పోలీస్ సిబ్బంది హాజరు, క్రమశిక్షణ, సమయపాలనపై స్పష్టమైన సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకోవద్దని, ఆన్లైన్ గేమ్స్కుపూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ గేమ్స్ కారణంగా పలువురు ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఎస్పీ తెలిపారు.
ఇలాంటి వాటి జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు.పోలీస్ సిబ్బంది తమకు కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు పరిశీలించి, స్టేషన్ను పరిశుభ్రంగా, సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ సూచించారు. కేసుల నమోదు, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలిపారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను మరింత బలపర్చాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతాయుతంగా, గౌరవంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో జరుగుతున్న ఆస్తి సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, చోరీలకు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్త్స్రలు, సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. నిరంతర పెట్రోలింగ్, గస్తీ, అనుమానితులపై నిఘా, నేర నియంత్రణ సాధించి, పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ విఠల్ రెడ్డి, టౌన్ సీఐ శ్రీధర్, రూరల్ సీఐ తిరుపయ్యతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.