calender_icon.png 1 October, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు ఖైదీల నిరాహార దీక్ష!

01-10-2025 02:00:36 AM

  1. అధికారుల వేధింపులకు నిరసనగా దీక్ష చేపట్టారని ప్రజాసంఘాల ఆరోపణ
  2. జైలు వద్ద ధర్నాతో ఉద్రిక్తత 
  3. ఆరోపణలను ఖండించిన సూపరింటెండెంట్

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి ): హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో మావోయిస్టు ఖైదీలు నిరాహార దీక్షకు దిగినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. జైలు అధికారుల వేధింపులకు, హింసాకాండకు నిరసనగానే ఈ దీక్ష చేపట్టారని పలు ప్రజాసంఘాలు ఆరోపిస్తుండగా, అది కేవలం సాధారణ బ్యారక్ మార్పు ప్రక్రియలో భాగమేనని జైలు అధికారులు స్పష్టం చేశారు.

ఈ పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో జైలు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.చంచల్‌గూడ జైలులోని మావోయిస్టు ఖైదీలపై అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారి హక్కులను కాలరాస్తున్నారని ఆరోపిస్తూ పలు పౌర, ప్రజా సంఘాలు మంగళవారం ఆందోళనకు దిగాయి. అధికారుల తీరుకు నిరసనగా లోపల ఖైదీలు నిరాహార దీక్ష చేస్తున్నారని వారు ప్రకటించారు. ఖైదీలకు మద్దతుగా జైలు వెలుపల ధర్నా కూడా చేపట్టారు.

అది సాధారణ ప్రక్రియే: జైలు సూపరింటెండెంట్ 

ఈ ఆరోపణలను చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ, మా జైలులో ఏడుగురు మావోయిస్టు ఖైదీలు ఉన్నారు. రొటీన్ ప్రాసెస్‌లో భాగంగా మంగళవారం వారి బ్యారక్‌లను మార్చామని అంతకుమించి ఎలాంటి వేధింపులూ జరగలేదు, అని స్పష్టం చేశారు.

పరిస్థితిని చక్కదిద్దే చర్యల్లో భాగంగా ఖైదీల తరఫున నలుగురు న్యాయవాదులు జైలులోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారని సూపరింటెండెంట్ తెలిపారు. అంతేకాకుండా, ఆరోపణలు చేస్తున్న ప్రజాసంఘాల నేతలతో మావోయిస్టు ఖైదీలకు ములాఖత్ సమావేశం కూడా ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఖైదీలు దీక్షలో ఉన్నారన్న వార్తల్లో వాస్తవం లేదని, వారు యథావిధిగా ఆహారం తీసుకుంటున్నారని జైలు వర్గాలు పేర్కొన్నాయి.