02-11-2025 12:12:33 AM
బంగారం లేదా క్షుద్ర పూజల కోసమే అంటున్న స్థానికులు
మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో వరుస ఘటనలు
చేగుంట, నవంబర్ 1: శ్మశానవాటిలో సగం కాలిన శవాలను, అవయవాలను మాయం చేస్తున్న వరుస ఘటనలు మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో చోటు చేసుకుంటున్నాయి. మృతదేహాల నోట్లో పెట్టే బంగారం కోసమో లేదంటే క్షుద్ర పూజల కోసమే దుండగులు శవాలను, చితాభస్మాలను మాయం చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తూ, భయభ్రాంతులకు లోనవుతున్నారు. మెదక్ జిల్లా చేగుంట పట్టణానికి చెందిన కర్రె నాగమణి(70) అనే వృద్ధురాలు శుక్రవారం చనిపోగా చేగుంటలోని వైకుంఠధామంలో ఆమె కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
శనివారం ఉదయం కుటుంబ సభ్యులు వైకుంఠధామం వెళ్లి చూడగా సగం కాలిన శవం చితికి దూరాన పడి ఉన్నది. శవంపై, చితిపై నీళ్లు పోసి శవాన్ని దుండగులు బయట పడేశారని కుటుంబీకులు తెలిపారు. అలాగే రెండు రోజుల క్రితం శతాధిక వృద్ధురాలు మురాడి నర్సమ్మ (105) చనిపోగా.. ఇదే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. చితి వద్దకు వెళ్లి చూడగా తల భాగంలో చితాభస్మాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు.
ఈ చర్యల పట్ల చేగుంట గ్రామస్థులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై చైతన్యరెడ్డి తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. అంత్యక్రియలు నిర్వహించే చోట మృతదేహాల నోట్లో కొంత బంగారం పెడుతారు. కొందరు చెవులకు ఉన్న పోగులు కూడా అలాగే వదిలేస్తారు. ఈ బంగారం కోసమే దుండగులు ఇలా చేసి ఉండొచ్చని ఎస్సై తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.