calender_icon.png 6 July, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11 కేజీల గంజాయి సీజ్

05-07-2025 08:24:33 PM

ఇద్దరు నింధితుల అరెస్ట్

వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ

సూర్యాపేట,(విజయక్రాంతి):  అక్రమంగా నిల్వ ఉంచిన 11 కేజీల గంజాయిని పట్టుకుని అందుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసిన ఘటన జిల్లాలోని కోదాడ మండలం దొరకుంటలో శనివారం జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కే నరసింహ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలోని కోదాడ మండలం దొరకుంట గ్రామానికి చెందిన అడప రాకేష్ ఇంటర్మీడియట్ చదివే సమయంలోనే తన స్నేహితుల ద్వారా గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడన్నారు.

ఇంటర్ అనంతరం వారి ఆర్దిక పరిస్థితులు బాగోలేక చదువు మానివేసి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 2023 వ సంవత్సరంలో కోదాడ రూరల్ పోలీస్ వారు ఇతని వద్ద గంజాయి పట్టుకుని కేసు నమోదు చేసి జైలుకు పంపించారన్నారు. జైలు నుండి బయటకు వచ్చిన తదుపరి గంజాయి సేవించడం మానేసినాడు. అయితే గత 10  రోజుల క్రితం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ గంజాయి కేసులో వాయిదాకు హాజరుకావడానికి సూర్యాపేట కోర్టుకు వెళ్లాడన్నారు. అక్కడ కోర్టు వాయిదా గురించి ఒడిస్సా రాష్ట్రం నుండి వచ్చిన ఒక వ్యక్తి పరిచయమైనాడు. అతను కూడా గంజాయి కేసు వాయిదా గురించి వచ్చినాడని తెలుసుకున్న తర్వాత ఆడప రాజేష్ తనకు గంజాయి తాగటానికి, అమ్మటానికి కావాలని ఆతనిని అడగగా అతను జూన్ 29 ఆదివారం రోజు ఒడిస్సా రాష్ట్రంలో కలిమెళ్ళలో శివ మందిర్ గుడి వద్దకు రమ్మని చెప్పాడన్నారు.

అతను చెప్పినట్లుగా తేదీ గత నెల 28న అతను  చెప్పిన అడ్రస్ కు వెళ్ళి తేదీ. 29 ఉదయం అతనిని కలిసి అతని నుండి సుమారు 11 కేజిల గంజాయి (6 ప్యాకెట్లు) ను రూ.11 వేలకు కొనుగోలు చేశాడన్నారు. అక్కడినుండి ఎవరికి దొరకాకుండా వచ్చేందుకు లారీలు, బస్ లో మారుకుంటూ 30వ తేదీన దొరకుంట గ్రామానికి వచ్చాడన్నారు. గంజాయి తన ఇంట్లో పెడితే అమ్మ తిడుతుందని, పోలీసు వారు పట్టుకుంటారు అని దానిని దొరకుంట గ్రామ శివారులో గల ఇండస్ట్రియల్ ఏరియా కి వెళ్ళు దారిలో ఐచర్ ట్రాక్టర్ షోరూం వెనుక ఖాళీ స్థలంలో చెట్ల పొదల మధ్య దాచిపెట్టారన్నారు.

అయితే అతని వద్ద తరచూ గంజాయి కొనుగోలు చేసే రెండవ నిందితుడైన కోదాడ పట్టణం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన వనపర్తి సాయి కుమార్ కు ఈనెల 2న ఫోన్ చేసి  గంజాయి తీసుకొని వచ్చిన విషయం చెప్పగా 4వ తేదీ మధ్యాహ్నం కొనుగోలు చేయడానికి వచ్చాడన్నారు. తదుపరి వారిద్దరూ కలిసి గంజాయి  దాచిన చోటుకు వెళ్లి రాకేష్ సుమారు కేజీ గంజాయిని సాయి కుమార్ కు ఇవ్వగా అదే సమయంలో పోలీసులు ఆకస్మాత్తుగా అక్కడికి వెళ్లి వారిద్దరినీ పట్టుకున్నారన్నారు. మొదటి నిందితుడైన రాకేష్ వద్ద నుండి 9.900 కేజీలు, ఒక సెల్ ఫోన్ రెండవ నిందితుడైన వనపర్తి సాయి కుమార్ నుండి 925 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్ ను స్వాదీనం చేసుకున్నారన్నారు. వీరిరువురిపై  కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. కాగా పట్టుబడిన గంజాయి విలువ సుమారుగా రూ 2.80 లక్షలు వరకు ఉంటుందన్నారు.