బీసీలకు జాగ బెత్తడే

27-04-2024 02:21:39 AM

బీసీలకు ఎంపీ సీట్ల కేటాయింపులో ప్రధాన పార్టీలది ‘అథమం’

n డజను సీట్లలో మూడింటితోనే బీసీలకు సరిపెట్టిన కాంగ్రెస్ పార్టీ

n సగం సీట్లను ఇచ్చిన బీఆర్‌ఎస్

n 5 సీట్లతోనే సరిపెట్టిన బీజేపీ

n ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చిన బీజేపీ

n ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక జనరల్ స్థానాల్లో మహిళలకు టిక్కెట్లు ఇచ్చిన కాంగ్రెస్

n ఒకే ఒక్క మహిళ.. అదికూడా ఎస్టీ స్థానంతో సరిపెట్టిన బీఆర్‌ఎస్ పార్టీ

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని మొత్తం జనరల్ సీట్లలో వెనుకబడిన, బలహీన వర్గాలకు, అలాగే మహిళలకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చిన సీట్లను చూస్తే.. ఆశ్చర్యం కలిగించకమానదు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలు, ఆకాశంలో సగం అయిన మహిళలకు రాజకీయ పార్టీలు మాత్రం అరచెయ్యి.. మొండి చెయ్యి చూపుతున్నాయనేదానికి ప్రత్యక్ష నిదర్శనంగా దీనిని చెప్పవచ్చు. కొన్ని పార్టీలు తప్పనిసరి పరిస్థితుల్లో కేటాయించినట్టుగాకూడా కనపడుతోంది. మొదటి నుంచి అటు మహిళలకు 33 శాతం, ఇటు బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నా.. ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కటికూడా దీనిని పట్టించుకున్న పాపాన పోలేదు. అరకొర విదిల్చినట్టుగా సీట్లను కేటాయించారు. అదికూడా ఇవ్వకపోతే ఏం చేస్తారనే ప్రశ్న రానందుకు అటు మహిళలు, ఇటు బీసీలు సంబరపడక తప్పని పరిస్థితి కనపడుతోంది.

డజను సీట్లున్నా..

రాష్ట్రంలో మొత్తం లోక్‌సభ స్థానాలు 17. ఇందులో ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 సీట్లు రిజర్వ్ అయ్యాయి. నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ స్థానాలు ఎస్సీలకు, ఆదిలాబాద్, మహబూబాబాద్ స్థానాలు గిరిజనులకు రిజర్వ్ చేశారు. ఇక మిగిలిన 12 సీట్లు జనరల్ సీట్లు. ఇందులో బీసీలకు, మహిళలకు ఆయా పార్టీల వారీగా కేటాయించిన స్థానాలను పరిశీలిస్తే.. మహిళలను రాజకీయాల్లోకి రాకుండా.. బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించకుండా ప్రధాన రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకుంటున్నట్టుగా అర్థం అవుతుంది.

బీసీలకు అర చెయ్యి..

మొత్తం డజను స్థానాలు జనరల్ ఉండ గా.. ఇందులో ఆయా పార్టీలు కేటాయించిన స్థానాలను పరిశీలిద్దాం..

l బీజేపీ పార్టీ కేవలం 5 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించింది. మల్కాజిగిరి, భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్ స్థానాలను బీసీలకు కేటాయించింది. అయితే ఇందులో సిట్టింగులు ఉన్నారు కాబట్టే.. జహీరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ స్థానాలను కేటాయించారు. లేకపోతే అవికూడా కేటాయించడంపై నమ్మకం లేదనే చెప్పవచ్చు. 

l బీఆర్‌ఎస్ పార్టీ ఒకింత నయమనేలా 6 స్థానాలను బీసీలకు కేటాయించింది. ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, భువనగిరి, నిజామాబాద్, జహీరాబాద్ స్థానాలు ఉన్నాయి.

l ఇక అధికార కాంగ్రెస్ పార్టీ అయితే కేవలం మూడంటే మూడు స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించి చేతులు దులుపుకుంది. సికింద్రాబాద్, మెదక్, జహీరాబాద్ స్థానాలు మాత్రమే. అంటే అర చేయి కాదు.. మొండి చేయి చూపించిందనే చెప్పవచ్చు.

మహిళలంటే మరీ అలుసు..

మహిళలకు కేటాయించిన సీట్ల పరిస్థితి మరీ దారుణం.. 33 శాతం ఇవ్వాలని డిమాండ్ చేసేవారూ.. చేయని వారు ఎవరూకూడా కనీసం ఐదంటే ఐదు సీట్లుకూడా కేటాయిం చలేదంటే అన్ని పార్టీలూ మహిళలపై 

చిన్నచూపే చూశారనే చెప్పవచ్చు.

l బీజేపీ పార్టీ నుంచి రెండు స్థానాల్లో.. అదికూడా జనరల్ సీట్లలో అవకాశం కల్పిం చారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్ స్థానాల్లో మహిళలకు అవకాశం ఇచ్చినా.. అందులో ఎవరూ బీసీలుగానీ, ఎస్సీ, ఎస్టీలుగానీ లేరు. ఇద్దరుకూడా ఓసీలే.

l అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం మూడు స్థానాలను మహిళలకు ఇచ్చినా.. అందులో జనరల్ స్థానం అయిన మల్కాజీగిరి నుంచి మాత్రమే అవకాశం ఇచ్చారు. మిగిలిన వరంగల్ ఎస్సీలకు, ఆదిలాబాద్ ఎస్టీలకు రిజర్వ్ అయిన స్థానాల్లో మహిళలకు కేటాయించారు.

l బీఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు  చేయాలంటూ పోరాటం చేసింది. కానీ బీఆర్‌ఎస్ పార్టీ నుంచే మహిళలకు మద్దత్తు దక్కలేదు. కేవలం ఎస్టీ నియోజకవర్గం అయిన మహబూబాబాద్ స్థానంలో అదికూడా.. సిట్టింగు అయినందున మహిళకు కేటాయించడ గమనార్హం.

అగ్ర వర్ణాలకే అందలం..

మొత్తంగా చూసుకుంటే.. అగ్రవర్ణాలకే అందలం దక్కినట్టుగా చెప్పుకోవచ్చు. ఎస్టీ, ఎస్సీ స్థానాలు మినహాయించి.. జనరల్ స్థానాల్లో బీసీలు, మహిళలకు అర చేయి.. మొండి చేయి చూపిన ప్రధాన రాజకీయ పక్షాలు.. అగ్రవర్ణాలకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చి.. ఎక్కువ సీట్లను వారికే కేటాయించాయి.

l అధికార కాంగ్రెస్ పార్టీ ఓసీలకు పెద్ద పీఠ వేసింది. రెడ్డిలకు 7 సీట్లు.. (మల్కాజీగిరి, చేవెళ్ళ, మహబూబ్‌నగర్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, నిజామాబాద్), వెలమ వర్గానికి ఒక సీటు (కరీంనగర్), మైనారిటీలకు ఒకటి (హైదరాబాద్) స్థానాలలో అవకాశం కల్పించింది.

l బీజేపీ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి 4 స్థానాలు (సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ), వెలమ సామాజిక వర్గానికి 2 సీట్లు (ఖమ్మం, మెదక్), బ్రాహ్మణ వర్గానికి ఒకటి (హైదరాబాద్) సీట్ల చొప్పున కేటాయించింది.

l బీఆర్‌ఎస్ పార్టీకూడా రెడ్డి సామాజిక వర్గానికి 4 సీట్లు (మల్కాజీగిరి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్), కమ్మ సామాజిక వర్గానికి ఒకటి 9 (ఖమ్మం), వెలమ వర్గానికి ఒకటి (కరీంనగర్) కేటాయించింది.

l మొత్తంగా చూసుకుంటే.. మొత్తం 12 జనరల్ స్థానాల్లో బీజేపీ 7 స్థానాలను అగ్రవర్ణాలకు కేటాయించగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏకంగా 9 స్థానాలను ఓసీలకు కేటాయించింది. ఇక బీఆర్‌ఎస్ పార్టీ 6 స్థానాలను అగ్రవర్ణాలకు కేటాయించడం గమనార్హం. అలాగే జనరల్ స్థానాల్లో బీఆర్‌ఎస్ మాత్రమే 50 శాతం (6సీట్లు) బీసీలకు కేటాయించగా.. మహిళల విషయానికి వచ్చేసరికి మొండి చేయి చూపించింది. కేవలం ఒకే సీటు (ఎస్టీ)ను మహిళకే ఇచ్చింది. బీజేపీ బీసీలకు కేవలం 5 సీట్లు కేటాయించి.. మహిళలకు 2 సీట్లే ఇచ్చింది. అయితే ఈ రెండు సీట్లుకూడా జనరల్ స్థానాలు అయినప్పటికీ.. అందులో ఎవరూ బీసీలు లేకపోవడం గమనార్హం. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు, మహిళలకు మొండి చేయి చూపించిందనే చెప్పవచ్చు. కేవలం 3 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించింది. మహిళలకు మూడు సీట్లని చెప్పుకున్నా.. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్‌డ్‌తోపాటు జనరల్ స్థానాల్లో ఒక్కటి మాత్రమే మహిళలకు కేటాయించింది. ఇలా ఏ కోణంలో చూసుకున్నా.. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో అటు బీసీలకు, ఇటు మహిళలకు ప్రధాన రాజకీయ పార్టీలు అర చెయ్యి.. మొండి చెయ్యి తప్పితే.. ఏ విధంగానూ ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పవచ్చు.

ప్రధాన పార్టీలు కేటాయించిన స్థానాలు ఇలా..

బీజేపీ బీఆర్‌ఎస్ కాంగ్రెస్ 

బీసీ 5 6 3

ఓసీ 7 6

ఎస్సీ 3 3 3

ఎస్టీ 2 2 2

ఓసీలలో కులాల వారీగా..

రెడ్డి 4 4 7

కమ్మ 0 1 0

వెలమ 2 1 1

బ్రాహ్మణ 1 0 0

మహిళలకు కేటాయింపు..

ఎస్సీ 0 0 1

ఎస్టీ 0 1 1

బీసీలు 0 0 0

ఓసీలు 2 0 1