calender_icon.png 7 October, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోహెడలో మైలారదేవుడు!

07-10-2025 12:00:00 AM

-కాకతీయుల తంత్రశైవ వారసత్వానికి కొత్త సాక్ష్యం

-11 శతాబ్ద శిల్ప శైలిలో గ్రామదేవతా రూపం

-వేములవాడ చాళుక్యుల నుంచి కాకతీయుల దాకా తంత్రశైవ ధార పునరుజ్జీవనం

-మైలారదేవుని పూజా వ్యాప్తి తెలంగాణ ప్రజా ఆధ్యాత్మికతలో నూతన దారి

-శిలను గుర్తించిన కొత్త చరిత్ర పరిశోధక బృందం 

హుస్నాబాద్, అక్టోబర్ 6: సిద్దిపేట జిల్లా కోహెడలో వెలుగులోకి వచ్చిన ఒక శిలా విగ్రహం చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల ఆసక్తిని రేకెత్తించింది. నల్లటి గ్రానైట్ రాతితో చెక్కిన ఆ విగ్రహం మొదట వైష్ణవ రూపంగా కనిపించినా, పరిశీలనలో అది తంత్రశైవ సంప్రదాయంలోని మైలారదేవుడు, యోగభైరవ రూపం అని స్పష్టమ వుతోంది. ఈ విగ్రహం రూపశైలీ, ఆలంకారాలు, ధ్యానభంగిమ కాకతీయ యుగ శిల్పకళా వైభవానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ రాతి శిల్పం ఇప్పుడు తెలంగాణ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుల ప్రకారం ఈ శిల్పం సాధారణ శివరూపం కాదు. మైలారదేవుడు అనే గ్రామశైవ తంత్రరూపానికి చెందినది.

గుట్టపైన ఉన్న ఈ శిల్పాన్ని కొందరు గ్రామస్తులు ఎప్పుడో తీసుకొచ్చి ఇక్కడి హైస్కూల్ లో ఉంచారు. సోమవారం కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు దీనిని గుర్తించారు. ఈ శిల్పం కాకతీయుల కాలంలోని తంత్రశైవ వారసత్వానికి ప్రామాణిక సాక్ష్యంగా నిలిచింది. మైలారదేవుడు, మైలారేశ్వరుడు అనేది దక్షిణ భారత తంత్రశైవ పంథాలో ముఖ్యమైన దేవత. కర్ణాటకలోని మైలార పట్టణం నుంచి ప్రారంభమైన ఈ ఆరాధన, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులవరకు వ్యాప్తి చెందింది. ఇతడు భైరవుని అవతారం. శివుని ఉగ్ర, యోగరూపం. భక్తి తత్వంలో మైలారేశ్వరుడు ప్రజల రక్షకుడిగా, శత్రు నాశకుడిగా, యోగసిద్ధి ప్రసాదకుడిగా పూజించబడతాడు. ఈ పూజలో శైవతంత్ర, వీరశైవ, కులదైవ సంప్రదాయాలు మేళవించబడి ఉంటాయి. కోహెడలో గుర్తించిన ఈ విగ్రహం కూడా అదే శైవతంత్ర మూలాల స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది.

శిల్ప లక్షణాలు

విగ్రహం ఒకే గ్రానైట్ రాతి పలకపై చెక్కబడింది. దేవుడు కాళ్లు మడిచి యోగాసనం లో కూర్చున్నాడు. ఇది యోగభైరవ రూపానికి చిహ్నం. నాలుగు చేతులు ఉన్నాయి. కుడివైపు చేతుల్లోని ఒక చేతిలో డమరుకం, మరొకచేతిలో త్రిశూలం వంటిది చెక్కబడి ఉంది. ఎడమవైపు పాశం లాంటి రూపం, మరో చేతి భంగిమ ధ్యానసూచకంగా ఉంది. తలపై జటాజూటం ఆకారం స్పష్టంగా ఉంది. ఇది శివతత్త్వాన్ని సూచిస్తుంది. విగ్రహం చుట్టూ ప్రభావలి (ఓరల వలయాకార శిల్పం) చెక్కబడి, దివ్య కాంతిని సూచిస్తోంది. రెండు వైపులా చిన్న సహాయ ప్రతిమలు, సాధారణంగా గణలు లేదా ఉపాసక రూపాలు  ఉన్నాయి. ఈ లక్షణాలు చూస్తే ఇది సాధారణ శైవ లింగారాధన విగ్రహం కాదని, యోగశైవ తంత్ర సంప్రదాయానికి చెందినదని తేలుతోంది.

కాకతీయుల శిల్పశైలి ప్రభావం

ఈ విగ్రహంలో కనిపించే జటాజూటం, ముకుట, అలంకారాలు, వంకరల ప్రభావలి కాకతీయ శిల్పకళా శైలికి నిదర్శనాలు. కాకతీయ యుగం (క్రీ.శ. 1100 1250)లో శైవతంత్రం రాజకీయ, సాంస్కృతిక, కళాత్మక రంగాలన్నింటిలో విస్తృతమైంది. వరంగల్, హనుమకొండ, వేములవాడ, పానగల్ ప్రాంతాల్లో యోగభైరవ, కాళభైరవ, మైలారేశ్వర శిల్పాలు చెక్కబడ్డాయి. కోహెడ అప్పట్లో వేములవాడ చాళుక్య, కాకతీయుల మధ్య సాంస్కృతిక ప్రభావాన్ని పొందింది. అందుకే ఈ విగ్ర హం కూడా 12, 13వ శతాబ్దపు కాకతీయ శిల్పంగా చెప్పవచ్చని చరిత్రకారులు అంటున్నారు .

తంత్రశైవతం.. అంతర్ముఖ శివారాధన

తంత్రశైవ మార్గం, ప్రధానంగా ధ్యానం, మంత్రసిద్ధి, అంతర్ముఖ శివత్వాన్ని ప్రాముఖ్యంగా చూపుతుంది. మైలారదేవుడు యోగాసనంలో ఉండబం అంతర్ముఖ ధ్యానాన్ని సూచిస్తోంది. త్రిశూలం (శివుని త్రిపుటి శక్తులు  సృష్టి, స్థితి, లయం) డమరుకం (సృష్టినాదం) జటాజూటం (తపోరూపం) ఇవి తంత్ర మార్గంలోని యోగసిద్ధి సూచనలు. దీంతో ఈ విగ్రహం భక్తి రూపకల్పనకన్నా ఆధ్యాత్మిక సాధనకు, ధ్యానారాధనకు ప్రతీక అని చెబుతున్నారు.

శిల్పం సూచించే సాంస్కృతిక అర్థం

మైలారదేవుడి విగ్రహం కేవలం దేవతా రూపం కాదు. అది కాకతీయుల కాలంలోని ప్రజల ఆధ్యాత్మిక మానసికతకు ప్రతిబింబం. ఆ కాలంలో యోగం, తపస్సు, మంత్రసిద్ధి అనే అంశాలు రాజకీయ శక్తి, సామాజిక స్థిరత్వం కోసం కూడా ఆరాధనగా ఉపయోగించబడ్డాయి. తంత్రశైవ మార్గం ద్వారా శివుని సాక్షాత్కారం అనేది, కాకతీయ రాజులు కూడా తమ రాజశక్తి మూలంగా భావించేవారు. దీంతో ఈ విగ్రహం ఒక ప్రాంతీయ శైవతంత్ర వారసత్వానికి, కళాత్మక ప్రతిభకు, అంతర్ముఖ ఆరాధనా ధోరణికి సాక్ష్యంగా నిలుస్తోంది. కోహెడ మట్టిలో ఇలాంటి శిల్పాలు ఇంకా ఉన్నాయేమోననే ఆసక్తి, పురావస్తు పరిశోధనకు కొత్త మార్గాలను తెరుస్తోంది.

ఇదీ చారిత్రక నేపథ్యం

కోహెడ ప్రాంతం చరిత్రపరంగా వేములవాడ చాళుక్యుల ప్రభావం కింద ఉండి, తర్వాత కాకతీయుల ఆధీనంలోకి వచ్చింది. ఈ కాలంలో గ్రా మదేవాలయాలు, యోగ మఠాలు, శైవతంత్ర ఉపాసన కేంద్రాలు అనేకం నెలకొన్నాయి. వేములవాడలో భైరవ ప్రతిమలు, ధ్యానరూప శివవిగ్రహాలు బయటపడ్డాయి. అదే సంప్రదాయం కోహెడలోని ఈ మైలారదేవుడు విగ్రహంలో కూడా ప్రతిబింబిస్తోంది. ఇది ఒక పెద్ద ఆలయం గర్భగుడి భాగంగా ఉండి, కాలక్రమంలో ధ్వంసమై బయటికి వచ్చి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.