17-05-2025 01:18:43 AM
-కంచ గచ్చిబౌలి చెట్ల నరికివేతపై సుప్రీం ఆగ్రహంపై ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ హర్షం
ముషీరాబాద్, మే16 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం, పర్యావరణం తరపున మాట్లాడేవారు ఎవరూ లేరన్న నిర్లక్ష్యంతో, ఎవరేమి మాట్లాడినా మేము పట్టించుకోము అనే రీతిలో నిరంతరం పర్యావరణ విధ్వంసాలకు పాల్ప డే వారికి కోర్టు హెచ్చరిక చెంపపెట్టని, కంచగచ్చిబౌలిలో తక్షణమే చెట్లు నాటి పూర్వ స్థితిని నెలకొల్పకుంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు అనేకమంది అధికారులు జైలు కు వెళ్ళాల్సి ఉంటుందని సుప్రీం చేసిన హెచ్చరికపై ఎన్విరామ్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు రంగయ్య హర్షం వ్యక్తం చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. .. పాల క పార్టీలకు, ప్రభుత్వాలకు కేవలం అధికార అవసరంతో కూడిన అభివృద్ధి మాత్రమే ఉండకూడదని, తరాలు సుభిక్షంగా ఉండాలంటే పర్యావరణ పరిరక్షణ తోనే సాధ్య మన్న ధ్యాస ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రభుత్వాలకైనా పర్యావరణ సుస్థిరతకు పెద్దపీట వేయాలన్న ఆలోచన ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఓట్ల రాజకీయాలతో పర్యావరణ భావజాలానికి చెల్లుచీటీ కట్టిన ప్రభుత్వాలకు, అధికారులకు సుప్రీం సిజేఐ జస్టిస్ గవాయ్ ఆగ్రహం ఒక హెచ్చరిక అని, దాన్ని ఒక తారక మంత్రం లా తీసుకొని ఇకనైనా పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని రంగయ్య విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా అనేక కీలక సందర్భాల్లో బాధితుల తరపున కోర్టులు ప్రత్యేక చొరవ తీసుకొంటుండటం భారత న్యాయ వ్యవస్థ తన ఔన్నత్యాన్మి నిరంతరం నిలబెట్టుకోవడం అభినందనీయమని రంగయ్య పేర్కొన్నారు. సుప్రీం ధర్మాసనం చొరవకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఈపీ డీసీ)ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.