30-01-2026 01:57:46 AM
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : తెలంగాణను నాలెడ్జ్ హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన గురువారం ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో సందడి చేశారు. హార్వర్డ్‌లోని భారతీయ విద్యార్థుల బృందం ఆహ్వానం మేరకు ఆయన క్యాంపస్‌ను సందర్శించి, భవిష్యత్ తెలంగాణ లక్ష్యాలపై వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆర్థికంగా, విద్యాపరంగా అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు.
అభివృద్ధి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయడమే ధ్యేయమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను తీసుకురావడంపై విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలను కూడా స్వీకరించారు.
కృత్రిమ మేధ , డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతికతలో యువతకు శిక్షణ ఇచ్చి, వారిని గ్లోబల్ మార్కెట్‌కు సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా ఆర్థిక విధానాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా హార్వర్డ్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో చదువుతున్న తెలుగు, భారతీయ విద్యార్థులు తమ విజ్ఞానాన్ని రాష్ట్ర ప్రగతికి వెచ్చించాలని సీఎం పిలుపునిచ్చారు.