19-09-2025 01:16:24 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ కుంభమేళాగా పిలుచు కునే మేడారం జాతరకు సంబంధించి ఆదివాసీ గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ, భక్తులకు సౌకర్యాలు వంటి ప్రాధాన్యత అంశాలతో కూడిన మాస్టర్ ప్లాన్‌కు తుదిరూపు ఇచ్చినట్టు వరంగల్ ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఈ మాస్టర్ ప్లాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం లభించిన వెంటనే ఆధునీకరణ పనులు ప్రారంభించి వందరోజులోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. దేశం నలుమూలల నుంచి మేడారం మహాజాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన దర్శనం, ఇతర సౌకర్యాలు లభించేలా అంగుళం తేడా లేకుండా శాస్త్రోప్తంగా సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలు, సలహాలను ప్రతి అంశంలోనూ పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు తెలిపారు.
గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ మాస్టర్ ప్లాన్‌పై సమీక్షించారు. గద్దెల అభివృద్ధి డిజైన్, సమ్మక్క సారలమ్మ ప్రధాన ద్వారం డిజైన్, ప్రహారీ నిర్మాణానికి అవసరమైన రాతి డిజైన్ గద్దెల అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
అభివృద్ధి పనులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను రెండు రోజుల్లో సమర్పించాలని మాస్టర్ ప్లాన్ తయారుచేసిన కన్సల్టెన్సీని ఆదేశించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు స్వయంగా మేడారం వెళ్లి అక్కడి పూజారులు, స్థానిక ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని గద్దెల డిజైన్ తయారు చేసినట్టు పేర్కొన్నారు. గతంలో భక్తులకు క్యూలైన్ల వల్ల పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం సరిగా లభించేదికాదని, మహాజాతర సమయంలో ఇది భక్తులకు ఇబ్బందికరంగా ఉండేదని,
ఈ సమస్యను పరిష్కరించేందుకు భక్తుల సౌకర్యార్థం గద్దెల ప్రాంగణాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి గాంచిందని, ఇది గిరిజన సంప్రదాయానికి అద్దం పడుతుందన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.