26-11-2025 12:00:00 AM
మేడ్చల్, నవంబర్ 25(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీలు విలీనం కానున్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు లోపల, ఆనుకొని ఉన్నా 27 మున్సిపాలిటీలను జిహెచ్‌ఎంసి లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో మేడ్చల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్లు విలీనం కానున్నాయి.
జవహర్ నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, నిజాంపేట్ నగర కార్పొరేషన్ లో, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, దుండిగల్, కొంపల్లి, తూముకుంట, ఘట్కేసర్, పోచారం, నాగారం, ద్మగూడ మున్సిపాలిటీలు జిహెచ్‌ఎంసి లో కలువనున్నాయి. జిల్లాలో రింగ్ రోడ్డు బయట ఉన్న ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు మాత్రమే మిగలనున్నాయి. మేడ్చల్ జిల్లా ఇటీవలే అర్బన్ జిల్లాగా రూపాంతరం చెందింది. గతంలో మేడ్చల్, షామీర్పేట్, మూడు చింతలపల్లి, కీసర, ఘట్కేసర్ మండలాల్లోని 61 గ్రామపంచాయతీలు ఉండేవి.
ప్రభుత్వం రింగ్ రోడ్డు లోపల, ఆనుకొని ఉన్న 28 గ్రామ పంచాయతీలను మొదట సమీప మున్సిపాలిటీలలో విలీనం చేసింది. మిగిలిన గ్రామపంచాయతీలను మూడు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి అందులో విలీనం చేసింది. కొత్తగా ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఈ మున్సిపాలిటీలతోపాటు ఇందులో విలీనమైన గ్రామాలన్నీ పూర్తిగా మారుమూల గ్రామాలే. అంతేగాక వీటిలో గ్రామీణ వాతావరణం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మున్సిపాలిటీలలో విలీనం చేశారు.
జీహెచ్‌ఎంసీలో విలీనం ఊహించిందే..
ముందుగా ఊహించినట్లుగానే ఔటర్ రింగ్ రోడ్డు లోపల, ఆనుకొని ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలను జిహెచ్‌ఎంసి లో విలీనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికుల అభిప్రాయం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుంది. జిహెచ్ ఎంసి రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అందుకు అనుగుణంగా మొదట పంచాయతీలన్నీ సమీప మున్సిపాలిటీలలో విలీనం చేసింది.
పంచాయతీలను నేరుగా జిహెచ్‌ఎంసి లో విలీనం చేయడానికి వీలు లేదు. మున్సిపాలిటీలను మాత్రమే విలీనం చేయాలి. అందుకే రింగ్ రోడ్డు లోపల, ఆనుకొని ఉన్న జీపీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేసింది. ఇటీవల కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలలో, పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలలో డీ లిమిటేషన్ చేశారు. రింగ్ రోడ్డు ఆనుకొని, లోపల ఉన్న మున్సిపాలిటీలలో డీ లిమిటేషన్ చేయలేదు. దీనిని బట్టి మున్సిపాలిటీలు జిహెచ్‌ఎంసిలో విలీనం కానున్నాయని తేలిపోయింది.
ప్రజలకు పాలన దూరం
మున్సిపాలిటీలను జిహెచ్‌ఎంసి లో విలీనం చేయడంతో తమకు పాలన దూరం అవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక పన్నుల భారం మీద పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలలో స్థానికంగా కమిషనర్, సిబ్బంది ఉన్నారు. ఏదైనా సమస్య నేరుగా వెళ్లి విన్నవించేవారు. జిహెచ్‌ఎంసి లో విలీనం చేయడం వల్ల మున్సిపాలిటీలు జిహెచ్‌ఎంసి కార్యాలయాలుగా మారుతాయి. అధికారులు ఉంటారు. కానీ మున్సిపల్ తరహాలో పాలన ఉండదని, అధికారుల్లో జవాబుదారితనం, బాధ్యత అంతగా ఉండదని అంటున్నారు.
తగ్గనున్న పదవులు..
జిహెచ్‌ఎంసి లో విలీనం వల్ల రాజకీయ నాయకులుగా ఎదగడానికి అవకాశాలు అంతగా ఉండవు. ప్రస్తుతం 1000 నుంచి 1500 మంది ఓటర్లకు ఒక వార్డ్ కౌన్సిలర్ ఉండగా, జిహెచ్‌ఎంసిలో 30 వేల నుంచి 40000 మంది ఓటర్లకు ఒక కార్పొరేటర్ ఉంటాడు. అంటే ఒక మున్సిపాలిటీ పరిధిలో 15 నుంచి 20 పదవులు తగ్గనున్నాయి. పంచాయితీలలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జడ్పిటిసి పదవులు ఉంటాయి.
ఈ పదవులు ఉండవు. కొన్ని గ్రామాలకు కలిపే ఒక కార్పొరేటర్ ఉంటాడు. దీనిని బట్టి ఎన్ని పదవులు తగ్గుతున్నాయో అర్థం అవుతుంది. జిల్లాలో మున్సిపాలిటీలు జిహెచ్‌ఎంసి లో విలీనంపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఒక టర్మ్ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు కొనసాగిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ ఇప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది.