06-01-2026 01:32:27 AM
రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
హైదరాబాద్, జనవరి 5(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కోసం త్యాగాలు చేసిన రాహుల్ గాంధీ కుటుంబంపై కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని ఉరి తీయాలంటూ కేటీఆర్ బలుపుతో మాట్లాడుతున్నారన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని ఐలయ్య హెచ్చరించారు. సోనియమ్మ దయతోనే కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవించిందని గుర్తుచేశారు. కవిత చేసిన వ్యాఖ్యలకు ముందు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డివి పచ్చి అబద్ధాలు : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద
సీఎం రేవంత్ రెడ్డి పాలన అబద్ధాల పునాదుల మీద నడుస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. గత రెం డేళ్లుగా రేవంత్ పచ్చి అబద్ధాలు, మోసాలతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రతిసారి దేవుడిపై ఒట్లు వేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తానే ఆపించానని సీఎం చెప్పడం పచ్చి అబద్ధం. దీనిని ఏపీ ప్రభుత్వం కూడా ఖండించింది. ఇప్పుడాయన తల ఎక్కడ పెట్టుకుంటారు? అని ప్రశ్నించారు. జీరో అవర్ పేరుతో టైమ్ పాస్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఉద్యోగుల ఉసురు తగులుతుంది : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే ఉద్యోగులు ఎక్కువ కష్టాలు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ బకాయిల కోసం ఎదురుచూస్తూ 40 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం కావడానికి గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. ఉద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని, పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే బీజేపీ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
విద్యా వ్యవస్థ కుంటుపడింది : బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అధ్వానంగా తయారైందని ఎమ్మెల్యే ధ న్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో 45 శాతం పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేని పరిస్థితి ఉందని, ఇది దేశంలోనే రెండో అత్యధికమని ఆవేదన వ్యక్తం చేశారు. 119 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం సీఎం నియోజకవర్గమైన కొడంగల్‌లో మాత్రమే పనులు ప్రారంభించిందని విమర్శించారు. వెంటనే పాఠశాలలకు నిధులు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.