06-01-2026 01:31:49 AM
కేసముద్రంలోని స్థలాల్లో మాయమైన బోర్డులు!
ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం కరువు
అభివృద్ధికి అడ్డుగా మారిన స్థల సేకరణ
కేసముద్రం, జనవరి 5 (విజయక్రాంతి): ‘ఇది ప్రభుత్వ భూమి. ఆక్రమించిన వారు శిక్షార్హులు’ అంటూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో 2019లో పలుచోట్ల రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి గుర్తించిన భూముల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ బోర్డులు మాయమయ్యాయి. మళ్లీ 2020లో గతంలో ఉన్న భూములకు తోడు మరికొన్ని చోట్ల కొత్తగా బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ బోర్డులు కూడా కొద్ది రోజులకు కనుమరుగయ్యాయి. అసలు కేసముద్రంలో ప్రభుత్వ భూములు ఉన్నాయా? లేవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసముద్రం రెవెన్యూ పరిధిలో 256, 262తో పాటు పలు సర్వే నంబర్లలో పలుచోట్ల ప్రభుత్వ భూములు ఉన్నట్లు సర్వే ద్వారా గుర్తించిన అధికారులు.. ఆ భూములను అన్యాక్రాంతం కాకుండా అడ్డుకునేందుకు అప్పట్లో రక్షణ చర్యలు తీసుకున్నారు.
కొన్నిచోట్ల ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూడా తొలగించారు. అప్పట్లో తహసీల్దారుగా బన్సీలాల్ ఉన్న సమయంలో ప్రభుత్వం మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ భూములను గుర్తించాలని, ప్రభుత్వ అవసరాల కోసం ఆ స్థలాలను పరిరక్షంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు. గుర్తించిన భూముల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.
కొంతకాలం వరకు ఆ భూముల జోలికి ఎవరు కూడా వెళ్లలేదు. తహసీల్దార్ బన్సీలాల్ బదిలీపై వెళ్లడంతో మళ్లీ ఆ భూములకు రెక్కలు వచ్చాయి. బన్సీలాల్ విధులు నిర్వహించిన సమయంలో ఉప తహసీల్దారుగా ఉన్న మాధవపెద్ది వెంకటరెడ్డి పదోన్నతిపై కేసముద్రం తహసీల్దారుగా నియమితులయ్యారు. ఆయన వచ్చిన తర్వాత మళ్లీ ప్రభుత్వ భూములను పరిరక్షంచేందుకు చర్యలు చేపట్టి, మళ్లీ సర్వే చేయించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలకు హద్దులు నిర్ణయించి, బోర్డులు ఏర్పాటు చేశారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ ప్రభుత్వ భూముల్లో బోర్డులు కనుమరుగయ్యాయి. ఇందులో చాలా చోట్ల అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారు. మరికొన్ని చోట్ల భూమిని అక్రమ మార్గాన విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
మున్సిపల్ ఆఫీసులకు స్థలం లేదు!
కేసముద్రం మున్సిపాలిటీగా ఆవిర్భవించడం, వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం లేక నిర్మాణాలకు నోచుకోవడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సలహాదారుగా నియమితులైన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి తన సొంత మండలం కేసముద్రంను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీకి కార్యాలయం నిర్మించడానికి అవసరమైన స్థలం కరువైంది. అలాగే బంజారా భవన్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. స్థలం లేక నిర్మాణానికి నోచుకోవడం లేదు. మహిళ శక్తి భవనం కూడా నిర్మించడానికి నిధులు మంజూరై స్థలం లేక ఆగిపోయింది.
ఫైర్ స్టేషన్ కూడా మంజూరుకాగా స్థలం లేక నిర్మాణానికి అడ్డుగా మారింది. మినీ స్టేడియం నిర్మాణానికి కూడా స్థలం లేదు. ప్రభుత్వ స్థలం మండల కేంద్రంలో పలుచోట్ల ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఆ స్థలం జోలికి వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. 50 పడకల ఆసుపత్రి మంజూరు కాగా అవసరమైన స్థలం లభించక ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోనే నిర్మించాల్సిన పరిస్థితి నెలకొంది. డిగ్రీ కళాశాలకు కూడా నిధులు మంజూరు కాగా అవసరమైన స్థలం లభించకపోవడంతో ప్రస్తుతం జూనియర్ కళాశాల ఆవరణలోనే నిర్మాణాన్ని చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
పాత రికార్డులు పరిశీలిస్తాం
మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అయిన విషయంపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించడానికి పాత రికార్డులను పరిశీలిస్తాం. ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటాం.
వివేక్, తహసీల్దార్, కేసముద్రం