02-07-2025 03:58:13 PM
హైదరాబాద్: కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. ఒక సామాజిక బాధ్యతగా సామాన్య ప్రజలకు సేవలు అందించడం వల్ల వైద్య వృత్తిలో గొప్ప అనుభూతి, ఆత్మ సంతృప్తి లభిస్తుందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏఐజీ హస్పిటల్స్ (AIGHospitals) నెలకొల్పిన నూతన ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కార్పొరేట్ రంగంలో ఉన్న వైద్యులు ప్రభుత్వ సేవలు అందించాలంటే అనుసంధానం చేయడానికి వీలుగా ఇప్పటివరకు సరైన వేదిక లేదని, అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్టు చెప్పారు. “అమెరికాలో స్థిరపడిన మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు వారు సేవలు అందించాలంటే అందుకు తగిన ప్లాట్‌ఫామ్ ఏదీ లేదు. వారిక్కడ ఉన్న సమయంలో వారి సేవలు అందించాలనుకుంటే అందుకు అనుగుణంగా ఒక వేదిక ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించామన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ప్రాణాలు పోతాయన్న అభిప్రాయం నుంచి దూరం చేయాలన్న ఆలోచనతో కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే వందేళ్ల ఉస్మానియా ఆసుపత్రికి 30 ఎకరాల స్థలం కేటాయించి 3 వేల కోట్లతో కొత్త ఆసుపత్రి నిర్మిస్తున్నామని తెలిపారు. నిమ్స్‌లో మరో 2 వేల పడకల విభాగం ప్రారంభించబోతున్నామని,. అలాగే వరంగల్, అల్వాల్, ఎల్‌బీ నగర్, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేట్‌కు దీటుగా రాష్ట్రంలో 7 వేల పడకలతో ఆసుపత్రులను వచ్చే డిసెంబర్ 9 నాటికి అందుబాటులోకి తేవాలని నిర్ధేశించారు.
పెరిగిన వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని అధికారం చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ(Rajiv Aarogyasri) పరిమితిని 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. దాంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి (Chief Minister's Relief Fund) కింద ఇప్పటివరకు 14 వందల కోట్లు ఖర్చు చేశామన్నారు. నిరుపేదలకు వీలైనంత వరకు విద్య, వైద్యం అందించాలన్న ఆలోచనతో ఆ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాంమని, బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ.11,500 కోట్లు, విద్యకు రూ.21 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో కోటి మంది సభ్యులను చేర్పించడమే కాకుండా వారందరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలన్నది మా లక్ష్యం. వారందరికీ వారివారి హెల్త్ ప్రొఫైల్స్‌తో ఒక యూనిక్ ఐడీ నంబర్‌తో కార్డులను జారీ చేయాలి.
మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకే నివారణ చర్యల్లో భాగంగా హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేయాలన్న ఆలోచన చేశాం. రాబోయే వంద సంవత్సరాలు లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌లో ఒక చాప్టర్ ఆరోగ్య రంగం. అందుకోసం డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి భాగస్వామ్యం కావాలి. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఇటీవలే ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారిని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. నగర ప్రజలకు రెండో అతిపెద్ద ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారికి అభినందనలు.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 దేశాల నుంచి చికిత్స కోసం ఏఐజీ ఆసుపత్రికి వస్తున్నారంటే అది రాష్ట్రానికి గర్వకారణం. ఏఐజీ ఆసుపత్రి రూపొందించిన జననీ మిత్ర యాప్ వినియోగానికి సంబంధించి అధికారులను పంపించి అధ్యయనం చేయమని చెబుతాం. ప్రస్తుతం నర్సింగ్ ప్రొఫెషన్ కు జపాన్ దేశంలో మంచి డిమాండ్ ఉంది. అందుకే మన వాళ్లకు జపనీస్ ల్యాంగ్వేజ్ నేర్పించాలని నిర్ణయించాం. భారత్ వెనుకబడిన దేశం అన్న అభిప్రాయం నుంచి బయకు తీసుకురావాలి. ప్రపంచంలోనే అనేక విషయాల్లో ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర మనకున్నది” అని ముఖ్యమంత్రి వివరించారు.