calender_icon.png 30 January, 2026 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేటర్ అభివృద్ధికి మెగా ప్లాన్

30-01-2026 12:39:37 AM

  1. స్టాండింగ్ కమిటీ సమావేశంలో 52 కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్
  2. పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలి
  3. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 29 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధ్యక్షతన జరిగిన 11వ సాధారణ స్టాండింగ్ కమిటీ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాం డ్ కంట్రోల్ రూమ్‌లో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 52 అంశాలకు ఎజెండా, సప్లిమెంటరీ, టేబుల్ ఐటమ్స్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలో ఇప్పటికే పూర్తయిన అభివద్ధి పనులను ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.

నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు పలు కొత్త ఫ్లుఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి కమిటీ పరిపాలనా అనుమతులు మంజూ రు చేసింది. ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వద్ద వన్-వే ఫ్లుఓవర్, టీవీ9 జంక్షన్ వద్ద అండర్‌పాస్ , ఫ్లుఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే బైరమల్‌గూడ నుంచి ఒవైసీ జంక్షన్ వరకు 60 మీటర్ల వెడల్పు రోడ్డుతో కూడిన 6 లేన్ల ఫ్లుఓవర్ నిర్మాణానికి, మైలార్‌దేవ్‌పల్లి  శంషాబాద్  కాటే దాన్ జంక్షన్ల వద్ద 6 లేన్ల గ్రేడ్ సెపరేటర్ నిర్మాణానికి సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చారు.

పాటిగడ్డ, మౌలాలి ఆర్‌ఓబీ పనులతో పాటు, మస్జిద్‌బండ నుంచి బొటానికల్ గార్డెన్ వరకు 120 అడుగుల రోడ్డు అభివద్ధి పనులకు కమిటీ ఆమోదం తెలిపింది. సనత్‌నగర్, ఫతేనగర్ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు, అఫ్జల్ సాగర్ నాలా రీమోడలింగ్ పనులకు కూడా అనుమతులు లభించాయి. వీటితో పాటు పలు జంక్షన్ల వద్ద ప్రముఖుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ ను 30.03 శాతం నుండి 33.67శాతం కు కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

కొత్తగా విలీనమైన పురపాలికల పారిశుధ్య, ఎంటమాలజీ, వెటర్నరీ సిబ్బందికి ఫేస్ రికగ్నిషన్ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశంలో జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బాబా ఫసియుద్దీన్, జగదీశ్వర్ గౌడ్, అడిషనల్ కమి షనర్లు, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.