13-08-2025 12:54:08 AM
పటాన్ చెరు, ఆగస్టు 12 : పటాన్ చెరు మండల పరిధిలోని భానూరు, నందిగామ, క్యాసారం గ్రామ పంచాయతీలను సమగ్ర అభివృద్ధి కోసం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్యను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం సంగారెడ్డిలో కలెక్టర్ తో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కలెక్టర్ తో చర్చించారు.
ఇటీవల పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలో ఇంద్రేశం, జిన్నారంను ప్రభుత్వం నూతన మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ పటాన్ చెరు మండల పరిషత్ పరిధిలో మొత్తం 19 గ్రామపంచాయతీలలో భానూరు, నందిగామ, క్యాసారం గ్రామాలు మాత్రమే మండల పరిధిలో మిగిలిపోయాయని, మిగతా గ్రామాలు ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీల పరిధిలోకి వెళ్ళాయని కలెక్టర్ కు తెలిపారు.
భానూరు, నందిగామ, క్యాసారం ఈ మూడు గ్రామాలలో మరింత అభివృద్ధి, మెరుగైన పరిపాలన సౌలభ్యం కోసం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. గతంలో కోరిన విధంగా నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణం కోసం పటాన్ చెరు రెవెన్యూ పరిధిలోని పోచారం గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 69లో త్వరితగతిన భూమి కేటాయింపులు చేయాలని కోరారు.
ఈ విద్యా సంవత్సరం నుండి పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన తరగతులు పటాన్ చెరు పట్టణంలోని డిగ్రీ కళాశాల భవనంలో ప్రారంభమయ్యాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్ల నిధులు కేటాయించిందని, భూమి కేటాయింపులు జరిగితే వెంటనే పనులు ప్రారంభించవచ్చని పేర్కొన్నారు.
ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం గ్రామ పరిధిలో గల కొత్త కుంట, పాపాయిగూడ కుంట, గొల్లవానికుంట, ఉబ్బాని కుంట, వడ్లవానికుంట, ఆరోటోని కుంటల పరిధిలోని 39 ఎకరాల ఆరు గంటల భూమి పూర్తిగా ఆక్రమణకు గురైందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కుంటలు ఆక్రమణలకు గురి కావడం మూలంగా వీటిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు స్థానిక పరిశ్రమలలో కూలీలుగా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే ఆరు కుంటల పరిధిలో ఆక్రమణలు తొలగించి చేపల పెంపకానికి అనువుగా తీర్చిదిద్దాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఇప్పటికే హైడ్రా కమిషనర్ తో పాటు, నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అధికారులకు సైతం విన్నవించడం జరిగిందని తెలిపారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రావిణ్య త్వరలోనే భూమి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని, పాశమైలారం గ్రామ పరిధిలో కుంటల అక్రమలపై వెంటనే విచారణ చేపడతామని హామీనిచ్చినట్లు ఎమ్మెల్యేపేర్కొన్నారు.