13-08-2025 12:52:35 AM
పదిన్నర తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 12 : కొన్ని సంవత్సరాలుగా పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు పాత నేరస్థుడు కావడం గమనార్హం. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం రాయవరం గ్రామానికి చెందిన దబ్బెట లింగం అలియాస్ బాబు అలియాస్ ప్రవీణ్ రాజ్ (30) అనే యువకుడు గతంలో పలు చోరీలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు.
అయినా తన నేర ప్రవృత్తిని మార్చుకోలేదు. రంగధాంపల్లి గ్రామంలోని విఘ్నేశ్వరనగర్ కు చెందిన తిరుగుళ్ళ కృష్ణమూర్తిశర్మ వృత్తిరీత్యా పురోహితుడు. మే 5న ఆయన పురోహితం పనిమీద కరీంనగర్ వెళ్లారు. అదే రోజు ఆయన భార్య జ్యోతి హైదరాబాద్ వెళ్లారు. సాయంత్రం కరీంనగర్ నుంచి తిరిగి వచ్చిన కృష్ణమూర్తి ఇంటికి చేరుకోగా, తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి చూడగా, కప్ బోర్డ్ లో దాచిన బంగారం ఆభరణాలు కనిపించలేదు.
వెంటనే స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణమూర్తి ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. నిందితుడిని గుర్తించి అతని కదలికలపై నిఘా ఉంచారు. మంగళవారం సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తా వద్ద బంగారం అమ్మడానికి వస్తున్న లింగం ను మాటు వేసి పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు.
లింగం అలియాస్ బాబు చిన్నతనం నుంచే నేర ప్రవృత్తి కలవాడని ఏసీపీ ఎం.రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. నిందితుడు తన తల్లిదండ్రులతో కలిసి కుషాయిగూడ కాప్రాలో నివాసం ఉంటూ ఏడో తరగతి చదువుతున్న సమయంలోనే స్నేహితులతో కలిసి దొంగతనం చేయగా కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు జువైనల్ హోంకు పంపించారని చెప్పారు.
జువైనల్ హోం నుంచి వచ్చిన తర్వాత లింగం దొంగతనాలే వృత్తిగా ఎంచుకున్నాడని తెలిపారు. నిందితుడిపై కుషాయిగూడ, అల్వాల్, గజ్వేల్, సిద్ధిపేట-I టౌన్, హుస్నాబాద్, కరీంనగర్-I టౌన్, కరీంనగర్-II టౌన్, వరంగల్ యూనివర్సిటీ, కీసర, జగదేవ్ పూర్, జమ్మికుంట, నేరేడిమేట్, ఖార్ఖాన, సుభేదారి, గౌరారం, కుకునూర్ పల్లి, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 80 చోరీ కేసులు నమోదయ్యాయని, చర్లపల్లి, చంచల్ గూడా, వరంగల్, కరీంనగర్, సిద్ధిపేట, సంగారెడ్డి జైళ్లకు వెళ్లాడని ఏసీబీ తెలిపారు.
నిందితుడు నుంచి పదిన్నర తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీనివాస్, బాబు, రాజు, స్వామి శ్రీకాంత్, రమేష్ లను ఏసీపీ రవీందర్ రెడ్డి అభినందించారు. త్వరలో పోలీస్ కమిషనర్ చేత రివార్డులు అందజేస్తామని తెలిపారు.