calender_icon.png 7 January, 2026 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలీనం.. విడ్డూరం!

05-01-2026 12:00:00 AM

  1. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై ప్రతిపక్షాలు గుస్సా

అసెంబ్లీ సాక్షిగా ఎండగడుతున్న ఎమ్మెల్యేలు

రంగారెడ్డి జిల్లాను మూడు ముక్కలు చేశారని

ఎమ్మెల్యే ‘మల్ రెడ్డి’ తీవ్ర ఆగ్రహం

సర్కిల్స్, జోన్ల ఏర్పాటుపై రాజుకుంటున్న నిరసనలు

రంగారెడ్డి, జనవరి 4 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అధికార, ప్రతిపక్ష నేతలు గుస్సా అవుతున్నారు. అధికార, విపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తున్నారు. ఇటు క్షేత్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ నిర్ణయంపై తప్పుబట్టడం సహజమే కానీ.. అధికార పార్టీ ఎమ్మెల్యే, పార్టీ నేతలే ప్రభుత్వ నిర్ణయం వ్యతిరేకించడం ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంలో ప్రజాభిప్రాయ సేకరణ పట్టింపు లేకుండా కనీసం స్థానిక ఎమ్మెల్యేల సలహాలు సూచనలు లేకుండా అధికారులు ఏకపక్ష నిర్ణయాలు చేశారని అధికార ప్రతిపక్షపార్టీల నేతలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. అధికారపార్టీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

విలీనం అనంతరం ఏర్పాటుచేసిన కొత్తగా ఏర్పాటుచేసిన సర్కిల్, జోన్ల కార్యాలయాలపై గజి బిజి ఏర్పడిందని దీంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని పరిపాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదంటూ.... అయితే సర్కిల్లో జోన్ల  ఏర్పాటులో  ప్రజలకు ఇబ్బందులు కలవకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మహేశ్వరం ఉనికి మాయం

ముఖ్యంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో రెండు జోన్ల  శంషాబాద్, రాజేంద్రనగర్ ఏర్పాటుచేసి మహేశ్వరం నియోజకవర్గం కి మొండి చేయి చూపడం మహేశ్వరం  నియోజకవర్గ వాసులు జీర్ణించు కోలేక పోతున్నారు.  నియోజకవర్గం లో  సరూర్నగర్, రామకృష్ణ పురం లో రెండు డివిజన్ల తో పాటు బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్, తుక్కుగూడ, జెల్ పల్లి మున్సిపాలిటీ ఉంటే ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గం లో జోన్  ఏర్పాటు చేయకపోవడం అందరిని విస్మయం వ్యక్తం చేస్తుంది.

మరో పక్క నియోజకవర్గంలోని బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్, తుక్కుగూడ, జల్ పల్లి మున్సిపాలిటీలను  శంషాబాద్ జోన్లో కలపడాన్ని స్థానిక అధికార నేతలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిభట్ల, తుర్క యాంజాల్ మున్సిపాలిటీ, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీల సర్కిల్ ఏర్పాటు సైతం అస్తవ్యస్తంగా మారింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ సర్కిల్ ఏర్పాటు చేసి కుంట్లూరు, నాగోలు, మన్సురాబాద్,పెద్ద అంబర్పేట్, లెక్చరర్ డివిజన్లను కేంద్రంగా పెద్ద అంబర్పేట్ లో సర్కిల్ ఏర్పాటుచేశారు.

దీన్ని ఆ ప్రాంత ప్రజలు తీవ్ర వ్యతిరేకిస్తున్నారు. మరో పక్క ఆదిభట్ల, తుర్కయంజాల్ సర్కిల్ లో ఏర్పాటు నిర్ణయాలు అధికారులకు తలనొప్పిగా మారింది. తోలుతా ప్రభుత్వం తుర్కయాంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను కలిపి, ఆదిబట్ల సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా ఆదిబట్ల సర్కిల్ ఏర్పాటుపై తుర్కయాంజాల్, తొర్రూరు వార్డుల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

మళ్ళీ అధికారులు ఆదిభట్ల నుంచి తుర్కయంజాల్ కు సర్కిల్ కార్యాలయాన్ని మార్చారు. దీంతో ఆదిభట్ల, కొంగర కాలనీ ప్రజలంతా నిరసనకు దిగుతున్నారు. ఇలా  అధికారుల అనాలోచిత, తొందరపాటు నిర్ణయాలతో  ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో  పూర్తిస్థాయి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా  సర్కిల్ జోన్ల  ఏర్పాటు ఒకే నియోజకవర్గంలోని  అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చు పెట్టినట్లయింది.

ప్రజల నుంచి వ్యతిరేకత

 గ్రేటర్ హైదరాబాదులో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సర్కిల్లో ఏర్పాటుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తుంది. సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు విషయంలో ఎక్కడ నిబంధనలు, నియమావళి లేకుండా జనాభా ప్రాతిపాదికన పరిగణనలోకి తీసుకోలేదని ప్రతిపక్ష పార్టీల నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దఅంబర్ పేట మున్సిపాలిటీ, ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన వార్డులను, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో విలీనం చేయడం పట్ల స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో తుక్కుగూడ, జల్ పల్లి, పహాడీషరీఫ్, బండ్లగూడజాగీర్, శంషాబాద్, రాజేంద్రనగర్ వంటి మున్సిపా లిటీలకు సంబంధించి సర్కిళ్ల జోన్లు ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉండటం భవిష్యత్ లో రాజకీయంగా తమకు పెద్దదెబ్బ అంటూ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా మెజార్టీ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ప్రజలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సర్కిల్ జోన్ల ఏర్పాటుపై పునరాలోచన చేస్తే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత తగ్గుతుంది. ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.