calender_icon.png 3 November, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి కేంద్రంగా మైక్రో మాఫియా!

03-11-2025 12:00:00 AM

  1. పుట్టగొడుగుల్లా వెలసిన ఫైనాన్స్ సంస్థలు 
  2. సూక్ష్మ రుణాల పేరిట రూ.కోట్లలో లావాదేవీలు 
  3. రికవరీ ఏజెంట్ల మానసిక వేధింపులు తాళలేక రోడ్డెక్కుతున్న మహిళలు 
  4. ఆందోళనలో పేద, మధ్య తరగతి కుటుంబాలు 

బెల్లంపల్లి, నవంబర్ 2 : ఆంధ్రాప్రాంతంలో ప్రారంభమై తెలంగాణలో ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన మైక్రో మాఫియా మళ్లీ బెల్లంపల్లిలో జడలు విప్పుతోంది. అడ్డగోలు దోపిడీకి తెరలేపుతుంది. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. కనుమరుగైపోయిందనుకున్న మైక్రో ఫైనా న్స్ దందా ఇప్పుడు కోల్ బెల్ట్ ప్రాంతాలను తన అడ్డాగా మార్చుకుంది. నిరుద్యోగ, నిరుపేద మహిళలనే తన టార్గెట్ గా పెట్టుకుని వారికి ఫైనాన్స్ ఇచ్చేందుకు ముందుకొస్తుంది.

గతంలో ఈ మైక్రో ఫైనాన్స్‌ల ఉచ్చు లో పడి ఎంతోమంది నిరుపేద మహిళలు  తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. తమ ఆర్థిక పరిస్థితి బాగోలేక మైక్రోసంస్థల నుండి ఫైనాన్స్ రూపంలో డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించలేని సందర్భాల్లో నిర్వాహకుల నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాం తంలో వెలసిన మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళలకు ఫైనాన్స్ ఇస్తూ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాయి.

ఈ ప్రాంతంలో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా  ఫైనాన్స్ సంస్థలను తెరిచి నిర్వాహకులు దందా సాగిస్తున్నారు. బెల్లంపల్లి కాల్ టెక్స్ ప్రాంతంలో బంధన్, టాటా క్యాపిటల్ (నిత్యా సూపర్ మార్కెట్ దగ్గర), ఏయు సింధుజ బ్యాంక్ (వైష్ణవి ఫంక్షన్ హాల్ పక్కన), ఏ.యు సింధుజ బ్యాంక్ (ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర), సాక్ష గ్రామ్ (జీ మార్ట్ లైన్), ఐఐఫెల్ (కాంట ఏరియా), యాక్సిస్ (బెల్లంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర) మైక్రో ఫైనాన్స్ సంస్థలు బార్ల కొనసాగుతుండగా, మంచిర్యాల ప్రాంతంలో గ్రామీణ కోట (గోదావరి రోడ్), స్పందన (మా విందు హోటల్ దగ్గర), చాటింగ్ (లక్ష్మి థియేటర్ లైన్) మైక్రో ఫైనాన్స్ సంస్థలు యదేచ్చగా కొనసాగుతూ మహిళలకు ఫైనాన్స్ ఆశ చూపెట్టి వారి కుటుంబాలను గుల్ల చేస్తున్నాయి.

మైక్రో సంస్థలపై నియంత్రణ కరువు..

కోల్ బెల్ట్ అనుబంధ పట్టణాలతో పాటు గ్రామాలలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలపై నియంత్రణ పూర్తిగా కరువైంది. గతంలో ఈ సంస్థల నిర్వహణను ప్రభుత్వం నిషేధించినప్పటికీ సరళీ కృత ఆర్థిక విధానాల ముసుగులో మహిళల ఉపాధి అవకాశాలకు చేయూతనిస్తామంటూ తమ కార్యకలాపాలు కొనసాగి స్తున్నాయి. బస్తీలలో, కాలనీలలో ఇళ్ళకే బోర్డులు పెట్టుకొని ప్రైవేటు బ్యాంకుల అనుబంధ ఫైనాన్స్ సంస్థలుగా కొనసాగుతు న్నాయి.

బెల్లంపల్లి ప్రాంతంలో ఏకంగా ఒక్కో మైక్రో ఫైనాన్స్ సంస్థ రూ. 5 నుంచి రూ. 10 కోట్లలో ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తుండడం గమనార్హం. కాల్ టెక్స్ ప్రాం తంలోని టాటా క్యాపిటల్ లో రూ. 6 కోట్లు, సాక్ష్యమ్ గ్రామ్‌లో రూ. 6 కోట్లు, ఏయూ సింధుజలో రూ. 10 కోట్లతో 20 వేల మందికి పైగా మహిళలకు మైక్రో రుణాలను అందించినట్లు సిబ్బంది చెబుతున్నా రు. అంటే ఈ ప్రాంతంలోని మిగతా సంస్థ ల్లో కూడా ఆర్థిక లావాదేవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సంబం ధిత అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి నిబంధనలకు విరుద్ధంగా రుణాల పాల్పడుతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

మానసికంగా వేధిస్తున్నారు: బొల్లం సత్యవతి, బెల్లంపల్లి

నేను బెల్లంపల్లిలోని పిన్ కేర్, యాక్సిస్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాను. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేక మధ్యలో రుణం చెల్లించలేకపోయాను. లోన్ రికవరీ ఏజెంట్లు ప్రతిరోజు ఇంటికి వచ్చి అసభ్యంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారు. రుణం చెల్లించేందుకు కొంత గడువు కావాలని అడిగితే బూతులు తిడుతూ బస్తీల్లో పరువు తీస్తున్నారు.

నిబంధనప్రకారమే రికవరీ

సంస్థ నిబంధనలకు లోబడే మహిళలకు ఉపాధి కోసం మైక్రో (సూక్ష్మ) రుణాలు అంది స్తున్నాం. ఆర్‌బీఐ అనుమతులతో  మైక్రో ఫైనాన్స్ సంస్థను నిర్వహిస్తున్నాం.  రుణాలు చెల్లించకుండా సంస్థని బదనాం చేస్తు న్న మహిళల చర్యలను చట్ట పరంగా ఎదుర్కొంటాం.

 రాజేష్, సాక్షమ్ సంస్థ క్లస్టర్ హెడ్

ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదు

ఇళ్లలోకి వచ్చి వేధిస్తున్నట్లు మహి ళల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యా దు అందితే మాత్రం ఉపేక్షించం. ఫైనాన్స్ సంస్థలపై విచారణ జరిపి బాధ్యులైన రికవరీ ఏజెంట్లపై చర్యలు తీసుకుంటాం.

 కుమార్, ఎస్సై బెల్లంపల్లి టూ టౌన్

ఇళ్లలోకి వచ్చి దాడులు చేస్తున్నారు

మేము రుణాల కోసం ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించలేదు. మైక్రో సం స్థల నిర్వాహకులే తమ ఇళ్లలోకే వచ్చి రుణాలు ఇచ్చారు. పదిమంది మహిళ లతో గ్రూపుగా ఏర్పాటు చేసి తక్కువ వడ్డీ పేరిట రుణాలు ఇచ్చారు. నేను బెల్లంపల్లిలోని పిన్ కేర్ (ప్రస్తుతం ఏయు సింధుజ), సాక్షమ్, బంధన్, గ్రామీణ కోట ఫైనాన్స్ సంస్థల్లో రుణం తీసుకున్నాను.

సగం వరకు అన్ని సంస్థ ల్లో రుణం చెల్లించాను. వరుణ్ చెల్లించ డంలో ఒకటి, రెండు రోజులు ఆలస్య మైతే లోన్ రికవరీ ఏజెంట్లు ఇళ్ళమీదికి వచ్చి దాడులు చేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఇళ్ళలోకి వచ్చి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. వీరి చర్యలపై జిల్లా కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే ,పోలీసు అధికారులకు కూడా మొరపెట్టుకున్నాం. తీసుకున్న రుణా లు తిరిగి చెల్లించేందుకు కొంత కాలం సమయమివ్వాలని వేడుకుంటున్నాం.

 దురిశెట్టి లావణ్య, బెల్లంపల్లి

ఆగడాలు మితిమీరిపోతున్నాయి

రికవరీ ఏజంట్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రుణం తీసుకున్న పాపానికి వారి చేతిలో అవమానాలు పడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ముందు ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారు. ఇళ్ల పైకి వచ్చి గొడవలు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారు.

 మామిడి బిందు, బెల్లంపల్లి