19-11-2025 12:00:00 AM
-జిన్నింగ్ మిల్లుల వద్ద దళారుల హడావుడి
-తేమ తరుగు పేరుతో నిలువు దోపిడీ
-పుష్కలంగా రాజకీయ నేతల అండదండలు
-పట్టించుకోని మార్కెటింగ్ శాఖ అధికారులు
-పత్తి కొనుగోలు నిలిపివేయడంతో రోడ్డున పడ్డ పత్తి రైతులు
నాగర్ కర్నూల్, నవంబర్ 18 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కొర్రీలు పెట్టి రైతులను రోడ్డుపాలు చేస్తున్నాయి. దళారుల నుండి కాపాడేందుకే నిబంధనలు సడలించినట్లు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద దళారులు మాటు వేసి రైతుల నుండి తక్కువ ధరకు సేకరించిన పత్తిని మరికొంతమంది రైతుల సహాయంతో ఎక్కువ ధరకు అమ్ముకొని నిజమైన రైతులు రోడ్డున పడేందుకు కారణం అవుతున్నారు.
నిత్యం పర్యవేక్షించి దళారుల భారి నుంచి రైతులను కాపాడాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఒక్కో కొనుగోలు కేంద్రం నుండి కమీషన్ రూపంలో భారీ మొత్తంలో ముడుపులు అందుకొని అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పత్తిని అమ్ముకునేందుకు స్మార్ట్ ఫోన్ లేని రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాపాస్ కిసాన్ అప్ లో పత్తి కొనుగోలుకు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతే పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని ఒక్కో రైతు ఎకరాకి ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని కోర్రీలు పెట్టడంతో సామాన్య రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కానీ దళారులకు మాత్రం ఎలాంటి నిబంధనలు పట్టింపులు లేకుండానే లారీల కొద్దీ పత్తిని కొనుగోలు కేంద్రంలో ఎలా దించేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిసిఐ కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి జిన్నింగ్ మిల్లు యజమానులంతా ఆయా పార్టీలకు సంబంధించిన ప్రధాన ఖద్దరు చొక్కా లీడర్లు కావడంతో ఆడిందే ఆట పాడిందే పాటగా పత్తి రైతులను నిండా ముంచేస్తున్నారని వాదన వినిపిస్తోంది. ఒక్కో జిన్నింగ్ మిల్ యజమానుల నుండి సంబంధిత శాఖ అధికారులు భారీగా ముడుపులు అందుకుంటుందని ఫలితంగానే రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.
ఒక్కో రైతు నుండి తేమ తరుగు పేరుతో 10 శాతానికి పైగా కమిషన్ నొక్కేస్తున్నారని అయినా అధికారులు అంటి ముట్టనట్లు వ్యవహరించడంతో ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. దీనికి తోడు కాటన్ అసోసియేషన్ ప్రైవేట్ పత్తి కొనుగోలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో అధిక వర్షాలు, యూరియా కొరత, తెగుళ్ల నుండి భారీగా అప్పుల పాలైన రైతులకు ములిగే నక్క పైన తాటికాయ పడ్డట్టుగా మారిందని రైతాంగం మానసిక వేదనకు గురవుతున్నారు. పత్తి కొనుగోలు కోసం తీసుకొచ్చిన వాహనాలు రోజుల తరబడి నిరీక్షణ చేయడంతో అద్దె చెల్లింపులకే పత్తి సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద దళారుల హంగామా.
ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఖద్దరు చొక్కా లీడర్లు జన్నింగ్ మిల్లులకు యజమానులుగా ఉండడంతో ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ వ్యాపారులు, పత్తిని సేకరిస్తున్న దళారులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ముకుమ్మడిగా అందిన కాడికి దండుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సమతీత మార్కెటింగ్ శాఖ అధికారి సైతం ఎవరికి అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అక్కడికి తీసుకువచ్చిన పత్తిని ఆయా రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్కడికక్కడే అదే మిల్లులో దళారులు పత్తిని అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా రాజకీయ ప్రధాన పార్టీ లీడర్లతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఈ వ్యవహారం పట్ల పట్టించుకోకపోవడంతో రైతుల పరిస్థితి అధోగతి పాలవుతోందని రైతాంగం మండిపడుతోంది.
సుదూర ప్రాంతాల నుంచి కత్తిని అమ్ముకునేందుకు ఆయా మిల్లుల వద్దకు వచ్చిన రైతులు పిల్ల జిల్లా ఇల్లు ఇడుపు అన్ని వదిలి పత్తి కొనుగోలు జన్నింగ్ మిల్లుల వద్ద అడికాపులు కాస్తూ దీనస్థితిలో బ్రతుకుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.