27-09-2025 02:01:44 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: అక్టోబర్ 1 నుంచి అమెరికా దిగుమతి చేసుకోబోయే బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఔషధాలపై 100 శాతం సుంకాలు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌లో ప్రకటించారు. ‘అమెరికాలో కర్మాగారాలు నిర్మించే కంపెనీలు కాకుండా మిగతా కంపెనీలు ఉత్పత్తి చేసే బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఔషధాలపై 100 శాతం దిగుమతి పన్ను విధిస్తా’ అని పేర్కొన్నారు.
ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించినా లేదా నిర్మాణంలో ఉన్నా ఈ సుంకాలు వర్తించవని తెలిపారు. దేశీయ తయారీని ప్రోత్సహించడం, ప్రభుత్వ బడ్జెట్ లోటును తగ్గించడంతో పాటు జాతీయ భద్రత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్షుడు వివరించారు. ఔషధాలు మాత్రమే కాకుండా కిచెన్ కేబినేట్స్, ఫర్నిచర్, భారీ ట్రక్కుల వంటి వస్తువులు దిగుమతి చేసుకున్నా సుంకాలు వర్తిస్తాయన్నారు.
కొత్తగా విధించిన సుంకాలను అక్టోబర్ 1నుంచి అమలు చేయనున్నారు. ఈ సుంకాలతో భారతీయ ఫార్మా రంగం మాత్రమే కాకుండా ప్రపంచ ఫార్మా రంగం కుదుపునకు గురికావడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అనేక రకాల ఉత్పత్తులపై సుంకాలు వేసిన ట్రంప్ తాజాగా ఔషధాలను కూడా వదలకపోవడం గమనార్హం.
భారతీయ ఫార్మా రంగానికి నష్టం లేదు
ట్రంప్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో భారతీయ ఫార్మా రంగానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదని కొద్ది మంది చెబుతున్నారు. ట్రంప్ ప్రకటనలో బ్రాండెడ్, పేటెంట్ మందులకే సుంకాలు వర్తిస్తాయన్నారు. భారత్ ఎక్కువగా జనరిక్ మందులనే అమెరికాకు ఎగుమతి చేస్తుంది. జనరిక్ ఉత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపును ఇచ్చినా ఫార్మా రంగం వల్ల అమెరికా జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని ట్రంప్ ప్రకటించారు. దీంతో ఔషధ కంపెనీలపై అక్కడి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.
భారతీయ ఫార్మా రంగంపై ఇప్పటికిప్పుడు ప్రభావం పడకపోయినా కానీ భవిష్యత్‌లో ప్రభావం పడే అవకాశం ఉంది. చాలా మట్టుకు భారతీయ ఫార్మా కంపెనీలకు అమెరికానే అతిపెద్ద మార్కెట్. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం 27.9 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయగా.. అందులో 9 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు అగ్రరాజ్యానికే వెళ్లాయి. అమెరికాలో వినియోగించే జనరిక్ మందుల్లో 45 శాతానికి పైగా భారతీయ కంపెనీలకు చెందినవే కావడం గమనార్హం.