calender_icon.png 27 July, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే బాలు నాయక్

27-07-2025 07:54:06 PM

దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, అల్పసంఖ్యాక వర్గాల ప్రజల సంక్షేమానికి తననవంతుగా ఎక్కువ నిధులు అందించి సహకరిస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమ శాఖల మంత్రి, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) తెలిపారు. ఆదివారం వారు దేవరకొండ నియోజకవర్గం, చందంపేట మండలం, పోలేపల్లిలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోరిన విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, రోడ్ల అభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించి తన వంతు సహకారాన్ని అందిస్తానని మంత్రి చెప్పారు.

గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, అలాంటిది తమ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతున్నదని, అంతేకాక ధనవంతులతో సమానంగా సన్న బియ్యం ఇస్తున్నామని, 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణం, 60 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అమలు చేసిన ఘనత తమదేనని అన్నారు. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణతో పాటు, 42 శాతం బీసీ రిజర్వేషన్ కు  సిఫారసు చేయడం జరిగిందని, ఎక్కడా లేని విధంగా కులగణన చేశామని, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు పేదలకే చేరాలని తెలిపారు. తన మంత్రిత్వ  శాఖల ద్వారా  తప్పనిసరిగా దేవరకొండకు ఎక్కువ నిధులను ఇచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి పునరుద్గాటించారు.

స్థానిక శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, అందులో భాగంగానే దేవరకొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు కొత్తగా 11736 కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరిగిందని, అంతేకాక రేషన్ కార్డులలో 15837 మందిని సభ్యులుగా చేర్చి వారందరికీ సన్నబియ్యాన్ని ఇవ్వనున్నామని చెప్పారు.ప్రతి ప్రభుత్వ పథకాన్ని పొందేందుకు రేషన్ కార్డు అవసరమని ,గత పది సంవత్సరాలలో ప్రభుత్వం రేషన్ కార్డులివ్వనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు తొమ్మిది రోజుల్లో 9000 కోట్ల రూపాయల రైతు భరోసాని ఇచ్చిందని, రుణమాఫీలో భాగంగా దేవరకొండ నియోజకవర్గం లో 360 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సన్నబియ్యమిస్తున్నామని తెలిపారు.

ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ఇతర నియోజకవర్గాలతో సమానంగా దేవరకొండను అభివృద్ధి చేస్తానని తెలిపారు.దేవరకొండ నియోజకవర్గానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో ఎక్కువ నిధులు కేటాయించాలని, రహదారులు లేని తండాలకు రహదారులకు నిధులు మంజూరు చేయాలని ,మైదాన ప్రాంతంలో ఐటిఏ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్డీవో రమణారెడ్డి జిల్లా  పౌరసరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజకుమార్, గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్ జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, సాంఘిక సంక్షేమ శాఖ డి డి శైలజ ,మాజీ పిఎసిఎస్ చైర్మన్ లు మార్కెట్ కమిటీ చైర్మన్ లు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.