calender_icon.png 13 July, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసర ఐఐఐటీని అభివృద్ధి చేస్తాం: మంత్రి కొండా సురేఖ

12-07-2025 07:28:34 PM

నిర్మల్ (విజయక్రాంతి): బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీ(RGUKT)ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) తెలిపారు. శనివారం ఆమె బాసర పర్యటన సందర్భంగా యూనివర్సిటీ అభివృద్ధిపై ఆర్జీయూకేటీలో విలేకరులతో మాట్లాడుతూ... ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. బాసర ఐఐఐటీలో విద్యార్థులకు ఉత్తమ వసతులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విద్యా విధానాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు ఈ యూనివర్సిటీ ప్రతిష్ఠను పెంచుతున్నారని తెలిపారు. యూనివర్సిటీలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) మాట్లాడుతూ.. బోధన, బోధనేతర అంశాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని తెలిపారు. త్వరలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రూ.3.20 లక్షల వ్యయంతో 'ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్' ప్రారంభం కానుందని పేర్కొన్నారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ.. సమస్యలు తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నాగేశ్, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్జీయూకేటీ ఉపకులపతి గోవర్ధన్, ఓఎస్‌డీ మురళీ దర్శన్, ఆర్డీఓ రత్న కళ్యాణి, ఇతర అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.