calender_icon.png 12 July, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దత్తగిరి ఆశ్రమంలో మంత్రి ప్రత్యేక పూజలు

11-07-2025 12:00:00 AM

ఆశ్రమంలో ఘనంగా గురు పూజోత్సవం

జహీరాబాద్, జూలై 10 : జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుపూర్ణిమను పురస్కరించుకొని గురువారం ఉదయం మంత్రి దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో గల 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం నిర్వహించారు.

అనంతరం మంత్రి యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ మహామండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ మంత్రిని సన్మానించి ప్రసాదం అందజేశారు.మంత్రితోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు పాటిల్, నల్లంపల్లి సిద్ధన్న పాటిల్,  వేణుగోపాల్, నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు. 

ఘనంగా గురు పూర్ణిమ ఉత్సవాలు...

దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో గురు పూర్ణిమ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహామండలేశ్వర్ సిద్దేశ్వర మహారాజును ప్రత్యేక రథంలో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులను ఉద్దేశించి మహామండలేశ్వర్ సిద్దేశ్వర నందగిరి మహారాజు మాట్లాడుతూ గురువు ప్రతి వ్యక్తికి అవసరమని మొట్టమొదటి గురువు వ్యాస భగవానుడని ఆయన తెలిపారు. ఏ పనికైనా చదువుకైనా గురువే అవసరమని, గురువుజాడలో నడిచిన వ్యక్తి ఎన్నడు చెడిపోడని సూచించారు. జహీరాబాద్ ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త అల్లాడి వీరేశం గుప్తా, బీఆర్‌ఎస్ నాయకుడు వై నరోత్తం, శంకర్, వేణుగోపాల్, నారాయణ, కృష్ణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 

మల్లన్న గట్టుకు పోటెత్తిన  భక్తులు..

గురు పూర్ణిమ పురస్కరించుకొని ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామంలో గల మల్లన్న గట్టుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మల్లన్న గట్టులో ఆశ్రమం నెలకొల్పిన మల్లయగిరి మహారాజ్ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. నిజామాబాద్, బాన్సువాడ, హైదరాబాద్, జహీరాబాద్, హుమ్నాబాద్,  బీదర్, గుల్బర్గా తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి గురు పూజోత్సవంలోపాల్గొన్నారు.