18-10-2025 12:17:23 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా కుల సర్వే(Caste survey) నిర్వహించి శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం నుండి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar ) వెల్లడించారు. మార్చి 30 నుండి గవర్నర్ దగ్గరకు వెళ్ళిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేకపోవడంతో రెండు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఇబ్బందులు కలుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోనే బిల్లులు పాస్ చేసుకోవడం జరిగిందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం, తదుపరి చర్యలు తీసుకపోవడం వల్లే బీసీ రిజర్వేషన్ల అమలు జాప్యం జరుగుతుందని ఆయన ఆరోపించారు. న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తాం.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని తెలిపారు. అన్ని రకాల పోరాటాలు జరిగే సందర్భంలో తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడి మాదిగ దండోరా, మాల మహానాడు , బీసీ సంఘాలు ఐక్య సమితిగా బంద్ కి పిలునిచ్చారని తెలిపిన పొన్నం వారికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరుగుతుందని, రవాణా శాఖ మంత్రిగా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా బంద్ చేసుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు అసౌకర్యం అయినప్పటికీ బంద్ ప్రభావం ప్రభుత్వంపై పడుతోందని వివరించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డిలు, బీజేపీ ఎంపీలు అందరూ తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని కోరారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండన్నారు. తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బాధ్యత మీది.. రాష్ట్రంలో మా బాధ్యత నిర్వహించామని సూచించారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ న్యాయస్థానంలో అయినా మేము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామన్న మంత్రి పొన్నం బంద్ లో పాల్గొన్న ప్రజలకు అభినందనలు తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో మన పోరాటం కొనసాగాలని పిలుపునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి జేఏసీ పోరాటాలు కొనసాగించారని తెలిపారు. అటు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.