20-09-2025 05:54:30 PM
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్1బీ వీసా పొందుతున్న వారిలో టెక్ సంబంధిత ఉద్యోగులే అధికమని పేర్కొన్నారు. మేధావులైన యువత అమెరికాలో ఉద్యోగాలు సాధించారని.. అన్ని టెక్ కంపెనీలకు నష్టం జరిగేలా ట్రంప్ ఉత్తర్వులు ఉన్నాయని అన్నారు. మెరుగైన ఉద్యోగాలు పొందాలనుకునే వారిపై ఆశలు చల్లేలా ట్రంప్ ఉత్తర్వులు తీసుకొచ్చారని, ఇప్పటికే 50 శాతం టారిఫ్ లతో ట్రంప్ సర్కార్ భారత్ కు తీవ్ర నష్టం చేస్తుందని తెలిపారు. ట్రంప్ సర్కార్ చర్చలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది..? ట్రంప్ ఉత్తర్వుల వల్ల భారతీయ టెక్ కంపెనీలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.
దౌత్యపరంగా కేంద్రప్రభుత్వం ఎందుకు జాగ్రత్త పడటం లేదు అని.. అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపటంలో కేంద్రంలోని బీజేపీ పూర్తిగా విఫలమైందని అన్నారు. దేశంలోని రాష్ట్రాలతో సంబంధాల్లోనూ మోదీ సర్కార్ విఫలమైందని, దక్షిణాది రాష్ట్రాల విషయంలో మోదీ సర్కార్ వైఖరి సరిగా లేదని తెలిపారు. అమెరికాలోని టెక్ కంపెనీలు కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని, ట్రంప్ నిర్ణయంపై కేంద్రం నుంచి దౌత్య చర్యలు లేవని అన్నారు. ఉమ్మడి ఏపీ సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై పెద్దఎత్తున ప్రభావం ఉందని, ట్రంప్ నిర్ణయంతో చిన్న కంపెనీలు మూసుకొని వెళ్లిపోవాల్సిందేనని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్ తగ్గితే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని, కేంద్రం ప్రభుత్వం కూడా దౌత్య చర్చల ద్వారా పరిష్కార మార్గాన్ని వెతకాలని తెలిపారు.