26-09-2025 12:00:00 AM
కాటారం, సెప్టెంబర్ 25, (విజయక్రాంతి) : లోక కళ్యాణార్థం, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మహా చండీయాగం నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం తన స్వగ్రామమైన ధన్వాడలో గల దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భవాని మాతా అమ్మవారి విగ్రహం వద్ద గణపతి హోమం, నవగ్రహ హోమం, మహా చండీయాగం నిర్వహించారు.
లోకమాత దుర్గాదేవి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా అన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులకు పాడిపంటలు అధిక దిగుబడులు రావాలని కోరినట్లు ఆయన తెలిపారు. దుర్గ భవాని దీక్ష మాల ధారణ చేసిన భక్తులతో, గ్రామ ప్రజలతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రి శ్రీధర్ బాబుకు ఆశీర్వచనాలు అందజేశారు.