30-01-2026 01:56:27 AM
విజన్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా ఉండాలి
వ్యవసాయ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజన్-- లక్ష్యాలను సాధించేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, ఆధునిక సాంకేతికతల అభివృద్ధి, కేంద్ర ప్రాయోజిత పథకాల ను పూర్తిగా వినియోగించుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి తుమ్మల గురువారం సచివాలయంలో వ్య వసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలను సమగ్రంగా, స్పష్టమైన లక్ష్యాలతో సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. రైతులకు ఇన్‌పుట్ సరఫరా, విస్తరణ సేవలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ సదుపాయాలు, డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలు, సహకార సంస్థల పని తీరు వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన త్వరలో నిర్వహించనున్న సమావేశానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని మంత్రి తుమ్మల అధికారులను సూచించారు. ఈ సమావేశంలో హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, వ్యవసాయం, ఉద్యాన వర్సిటీల వైస్‌చాన్స్‌లర్లు జానయ్య, రాజిరెడ్డి, తెలంగాణ సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ కిరణ్, మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆయిల్‌ఫామ్‌సాగులో అభినందనీయం : కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్
తెలంగాణలో అయిల్‌ఫామ్ సాగు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. గురువారం ఆరు రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, తెలంగా నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులకు అదనంగా మరో రూ.200 కోట్లు కేటాయిస్తే, రాష్ట్రంలో జాతీయ వ్యవసాయ యాంత్రీకరణ, ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ అభివృద్ధి లాంటి పథకాలను మరింత సమర్థవంతంగా అమ లు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని కేంద్రమంత్రికి వివరించారు.