10-10-2025 01:06:28 AM
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
పటాన్ చెరు, అక్టోబర్ 9 :విద్యార్థి దశ నుండి క్రీడల పట్ల ప్రోత్సాహం అందిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారని ఇందుకు బీరంగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులే ఉదాహరణ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఉషూ (కిక్ బాక్సింగ్) రాష్ట్ర స్థాయి పోటీల్లో బీరంగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎం.అశ్విని అండర్ 17 విభాగంలో బంగారు పతకం సాధించింది. త్వరలో కాశ్మీర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఇదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రుత్విక రెడ్డి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా స్థాయి షటిల్ బ్యాట్మెంటన్ పోటీల్లో బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.
ఈ మేరకు గురువారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ విద్యార్థులను అభినందించారు. రాబోయే జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలలో మెరుగైన ప్రదర్శనతో జాతీయ స్థాయిలో పటాన్చెరు పేరును నిలబెట్టాలని కోరారు. క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులను క్రీడలపట్ల ఆసక్తి పెంపొందించేలా సంపూర్ణ సహకారం అందిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంత, ఫిజికల్ డైరెక్టర్ అమూల్యను ఎమ్మెల్యే జిఎంఆర్ అభినందించారు.