11-09-2025 01:26:39 AM
పటాన్చెరు, సెప్టెంబర్ 10 :కార్మిక నేపథ్యం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పటాన్ చెరు పారిశ్రామికవాడలో ఎక్కడ ప్రమాదం జరిగిన కార్మికుల పక్షాన నిలబడుతూ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన పరిహారం అందిస్తూ కార్మిక పక్షపాతిగా నిలుస్తున్నారు. గతంలో అగర్వాల్ రబ్బర్ ఫ్యాక్టరీలో మరణించిన కార్మికుడికి 60 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇప్పించిన తరహాలోనే ఇదే రీతిలో పటాన్ చెరు లోని సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ కార్మికుడికి ఆ పన్న హస్తం అందించారు.
గత శనివారం శ్రీ సాయిబాబా సెల్యులోస్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ అమర్ సింగ్ అనే కార్మికుడు (59) తీవ్రంగా గాయపడ్డాడు. మెషిన్ లో పడి కుడి చేయిని కోల్పోయాడు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు కార్మికు లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆశ్రయించారు.దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గూడెం బాధిత కార్మికుడికి మెరుగైన చికిత్స అందించాలని ద్రువ ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు.
అనంతరం శ్రీ సాయి బాబా సెల్యులోజ్ పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి వారిని ఒప్పించి రూ.25 లక్షల పరిహారాన్ని ఇప్పించారు. బుధవారం సాయంత్రం ప టాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజన్ సింగ్, ఆకుల శ్రీశైలం, పరిశ్రమ ప్రతినిధులు, బొందిలి సంక్షేమ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.